ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జలవివాదాలపై అపెక్స్ కౌన్సిల్ భేటీకి రంగం సిద్ధం - ఏపీ తాజా వార్తలు

రాయలసీమ ఎత్తిపోతల వివాదం దృష్ట్యా.... నీళ్ల పంచాయతీకి కేంద్రం సిద్ధమైంది. ఈమేరకు అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. రెండు రాష్ట్రాల నీటిపారుదలశాఖ అధికారులు, కృష్ణా-గోదావరి నదీ యాజమాన్య బోర్డులకు కేంద్ర జల్‌శక్తి శాఖ లేఖ రాసింది. అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీలో చర్చించాల్సిన అంశాలను పంపాలను కోరింది.

apex council meet on water disputes between telangana and andhra pradesh
జలవివాదాలపై అపెక్స్ కౌన్సిల్ భేటీకి రంగం సిద్ధం

By

Published : May 21, 2020, 7:43 PM IST

Updated : May 22, 2020, 7:08 AM IST

శ్రీశైలం నుంచి 3 టీఎంసీల నీటిని మళ్లించేలా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకం తలపెట్టడంపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తంచేస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా, కేంద్ర జలశక్తి మంత్రి అధ్యక్షుడిగా ఉండే అపెక్స్ కౌన్సిల్‌ సమావేశం ఏర్పాటుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. రెండు రాష్ట్రాలు కనీసం కోరకుండానే... సుమారు మూడున్నరేళ్ల తర్వాత ఈ భేటీ ఏర్పాటుచేస్తుండటం విశేషం. ఈ సమావేశంలో చర్చించాల్సిన అంశాలను పంపాలని రెండు రాష్ట్రాలను కేంద్రం కోరింది. ఈ ఏడాది జనవరిలో కార్యదర్శి వద్ద జరిగిన భేటీలో చర్చించిన అంశాలు, అపెక్స్ భేటీకి అజెండా పంపుతామని చెప్పినా ఇప్పటివరకు అలాంటిదేమీ జరగలేదని లేఖలో ప్రస్తావించింది. అజెండా అంశాలను అత్యవసరంగా అందించాలని సూచించింది.


గతేడాది ఎన్నికల తర్వాత రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమై... గోదావరి నీటిని కృష్ణా బేసిన్‌లోకి మళ్లించడం, రెండు రాష్ట్రాలు వినియోగించుకోవడంపై చర్చించారు. అలాగే ఇరు రాష్ట్రాల ఇంజినీర్లు కూడా సమాలోచనలు చేశారు. అయితే కొన్ని నెలలుగా దీనిపై ముందడుగు పడలేదు. ఈ పరిస్థితుల్లోనే శ్రీశైలం 800 అడుగుల నీటిమట్టం నుంచి రోజూ 3 టీఎంసీల నీటిని మళ్లించేలా రాయలసీమ ఎత్తిపోతల పథకం, శ్రీశైలం కుడిగట్టు కాలవ సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది. ఆంధ్రప్రదేశ్‌ కూడా తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులను బోర్డు దృష్టికి తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలో కేంద్రం అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ ఏర్పాటుచేయడంపై సీఎంలు ఎలా స్పందిస్తారోనని ఉత్కంఠ నెలకొంది.


మొదటిసారిగా 2016 సెప్టెంబర్‌ 21న జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో... గోదావరి నుంచి పోలవరం ద్వారా మళ్లించే నీటిలో నాగార్జున సాగర్ ఎగువన వాడుకోవాల్సిన నీటిని తెలంగాణకు కేటాయించాలనే అంశంపై చర్చించారు. అలాగే టెలీమెట్రీల ఏర్పాటు, పాలమూరు-రంగారెడ్డి, దిండి ప్రాజెక్టులపైనా చర్చలు జరిగాయి. కృష్ణా జల ట్రైబ్యునల్‌-2 త్వరగా వచ్చేలా చర్యలు తీసుకుంటామని అప్పట్లో కేంద్రం హామీ ఇచ్చినా... ఇప్పటికీ నెరవేరలేదు. పాలమూరు-రంగారెడ్డి, దిండి ప్రాజెక్టులపై ఆనాటి భేటీలో ఏపీ అభ్యంతరం వ్యక్తంచేయగా.... ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టినవేనని తెలంగాణ చెప్పింది. ఆ సమావేశం తర్వాత రెండు ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయి. పోలవరం నుంచి కృష్ణా బేసిన్‌లోకి మళ్లించే నీటిలో 45 టీఎంసీలు తమకు కేటాయించాలని తెలంగాణ కోరింది. దానిపై కేంద్ర జలవనరుల శాఖ నిపుణుల కమిటీని ఏర్పాటుచేయగా... ఎలాంటి సిఫారసు చేయకుండానే కాలపరిమితి ముగిసింది. ఈ విషయంలో కేంద్రం ఏ చర్యా తీసుకోలేదు.

ఇదీ చదవండి:

విశాఖ హెచ్​పీసీఎల్ రిఫైనరీలో పొగలు.. ఆందోళనలో ప్రజలు

Last Updated : May 22, 2020, 7:08 AM IST

ABOUT THE AUTHOR

...view details