ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై 25న అపెక్స్​ కౌన్సిల్​ సమావేశం - తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అపెక్స్​ కౌన్సిల్​ సమావేశం

తెలుగు రాష్ట్రాల మధ్య.. కృష్ణా, గోదావరి జలవివాదాలపై ఈ నెల 25న అత్యున్నత మండలి సమావేశం జరగనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పరస్పర ఫిర్యాదుల నేపథ్యంలో... ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్రజలవనరుల శాఖా మంత్రి సమావేశం కానున్నారు. రాష్ట్ర విభజన అనంతరం... అపెక్స్ కౌన్సిల్ రెండో మారు భేటీ కానుంది.

Tg_Hyd_03_19_Apex_Council_Pkg_3053262
Tg_Hyd_03_19_Apex_Council_Pkg_3053262

By

Published : Aug 19, 2020, 6:28 AM IST

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య జలవివాదాలకు సంబంధించి అత్యున్నత మండలి సమావేశం కానుంది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖర రావు, జగన్మోహన్ రెడ్డితో కేంద్ర జలవనరుల శాఖా మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సమావేశం కానున్నారు. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ.. రెండు రాష్ట్రాలు, కేంద్ర జలసంఘం ఛైర్మన్, కృష్ణా, గోదావరి బోర్డుల ఛైర్మన్లకు సమాచారం అందించింది. ఆ రోజు ఉదయం 11 గంటల 30 నిమిషాలకు దృశ్యమాధ్యమం ద్వారా సమావేశం జరగనుంది.

పరస్పర ఫిర్యాదులతో..

కృష్ణా, గోదావరి నదులపై నిర్మించిన, నిర్మిస్తోన్న, తలపెట్టిన ప్రాజెక్టులపై... రెండు రాష్ట్రాలు ఇటీవల పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి. ఏపీ ప్రభుత్వం కొత్తగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని, పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు కోసం ఉత్తర్వుల జారీతో ఫిర్యాదులు ఊపందుకొన్నాయి. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల సమావేశాల్లోనూ.. పరస్పరం భిన్న వాదనలు వినిపించాయి. పొరుగు రాష్ట్ర ప్రాజెక్టుల వల్ల... తమ ప్రయోజనాలకు భంగం కలుగుతుందని వాదించాయి.

రాయలసీమ ఎత్తిపోతలపై... తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కొత్త ప్రాజెక్టుల పనులు ఆపాలని, ఫిర్యాదులు వచ్చిన ప్రాజెక్టుల సవివర ప్రాజెక్ట్ నివేదికలు ఇవ్వాలని... బోర్డులు ఇరు రాష్ట్రాలను కోరాయి. డీపీఆర్​లు ఇవ్వాలని గతంలోనే పలుమార్లు సూచించినప్పటికీ... రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అవి అందడం లేదని వ్యాఖ్యానించాయి. ఇద్దరు ముఖ్యమంత్రులకు కేంద్ర జలశక్తి మంత్రి లేఖ కూడా రాశారు. అటు రెండు రాష్ట్రాలు కూడా వివిధ అంశాలను పలు మార్లు లెవనెత్తుతూనే ఉన్నాయి. ఇతర బేసిన్‌కు జలాల మళ్లింపు నేపథ్యంలో ట్రైబ్యునల్ తీర్పు ప్రకారం వాటా... చిన్ననీటివనరుల ద్వారా వినియోగం... నివాస అవసరాలకు 20శాతంగానే పరిగణన... కృష్ణా బోర్డు ఆంధ్రప్రదేశ్​కి తరలింపు... కేటాయింపునకు మించి జలాల వాడకం... మిగిలిన జలాలను వచ్చే ఏడాదికి బదలాయింపు... తదితర అంశాలు ఇందులో ఉన్నాయి.

బోర్డుల సమావేశాలు, వివిధ సందర్భాల్లో ఈ అంశాలు ప్రస్తావనకు వస్తూనే ఉన్నాయి. కేంద్ర జలశక్తి శాఖ వాటిని పరిశీలిస్తుందని.. బోర్డులు చెప్తూ వస్తున్నాయి. వీటన్నింటి నేపథ్యంలో ఈ నెల 25న అత్యున్నత మండలి సమావేశాన్ని కేంద్ర జలశక్తి శాఖ.. ఏర్పాటు చేసింది. అపెక్స్ కౌన్సిల్ సమావేశం అజెండాలో 4 అంశాలను పొందుపరిచారు. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధి.. ప్రాజెక్టుల డీపీఆర్ ల సమర్పణ, కృష్ణా, గోదావరి నదీ జలాల్లో వాటా ఖరారు విధివిధానాలు ఖరారు అంశాలు ఇందులో ఉన్నాయి.

2016లో మొదటి అపెక్స్ కౌన్సిల్​ సమావేశం​

తెలుగు రాష్ట్రాల ఫిర్యాదులు, బోర్డులు సూచించే అంశాలపై... అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో చర్చ జరగనుంది. రాష్ట్ర విభజన అనంతరం అపెక్స్ కౌన్సిల్ రెండోసారి సమావేశం కానుంది. మొదటిసారి 2016 సెప్టెంబర్ 21న అప్పటి కేంద్ర మంత్రి ఉమాభారతి అధ్యక్షతన జరిగిన సమావేశంలో... తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. రెండు రాష్ట్రాలకు సబంధించిన పలు అంశాలపై చర్చించారు. తాజాగా అత్యున్నత మండలి రెండో సమావేశానికి ముహూర్తం ఖరారైంది. వాస్తవానికి ఈ నెల ఐదో తేదీనే సమావేశం నిర్వహించాలని కేంద్ర జలశక్తి శాఖ భావించినప్పటికీ.. ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల వల్ల సాధ్యం కాదని సీఎం కేసీఆర్ తెలిపారు. దీనితో ఈ నెల 25న అపెక్స్ కౌన్సిల భేటీ జరగనుంది. కోవిడ్ నేపథ్యంలో సమావేశం నేరుగా కాకుండా దృశ్యమాధ్యమం ద్వారా జరగనుంది.

ABOUT THE AUTHOR

...view details