APCC Sailajanath On Budget: కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి మొండి చేయి చూపించారని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజనాథ్ మండిపడ్డారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా, రైల్వే జోన్ ఇతర అంశాల ప్రస్తావన లేకపోవటం దారుణమన్నారు. నోట్ల రద్దు నుంచి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం పేదల జీవితాలను చిన్నాభిన్నం చేసి ఇప్పుడు డిజిటల్ భారత్ అంటూ కొత్త పల్లవి అందుకుందని ఎద్దేవా చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు, రైతులు, సామాన్యులకు, పేదలకు, వృత్తి కులాలకు, ఉద్యోగులకు తీవ్ర నిరాశ నిస్పృహలకు గురి చేసిందని స్పష్టం చేశారు. మోదీ ప్రభుత్వం 'జీరో' సమ్ బడ్జెట్ ప్రకటించిందని, వేతన జీవులకు శూన్యహస్తాలు చూపించారని ఎద్దేవా చేశారు. మసిపూసి మారేడు కాయ చేసి గోల్మాల్ బడ్జెట్ను ప్రవేశపెట్టారన్నారు. వ్యవసాయ రంగాన్ని ఆదుకునే దిశగా కేంద్రం తీసుకున్న చర్యలు శూన్యమని ఆక్షేపించారు. దేశంలోని చేనేత రంగానికి బడ్జెట్ సున్నా చుట్టిందన్నారు. నేతన్నలను ఆదుకునేందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!