ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఆదుకోవాల్సిన ప్రభుత్వమే.. అడ్డదారిన నిధులు మళ్లిస్తోంది' - ప్రభుత్వంపై మండిపడ్డ శైలజానాథ్

గ్రామ పంచాయతీ నిధులను దారి మళ్లించటంపై ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ మండిపడ్డారు. నిధులు ఇచ్చి ఆదుకోవాల్సిన ప్రభుత్వమే దొడ్డిదారిన నిధులు మళ్లించడం చూస్తే.. రాష్ట్ర ఖజానా దుస్థితి తేటతెల్లం అవుతోందని ఎద్దేవా చేశారు. రెండున్నరేళ్లలో పంచాయ‌తీల నుంచి దారి మళ్లించిన రూ.1,309 కోట్ల నిధులను త‌క్షణ‌మే పంచాయ‌తీ ఖాతాల‌లో జ‌మ‌చేయాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు.

శైలజానాథ్
శైలజానాథ్

By

Published : Mar 23, 2022, 4:40 PM IST

గ్రామ స్థాయిలో అభివృద్ధి కోసం వినియోగించాల్సిన నిధులను జగన్ రెడ్డి సర్కారు పక్కదారి పట్టిస్తోందని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ విమర్శించారు. నిధులు ఇచ్చి ఆదుకోవాల్సిన ప్రభుత్వం దొడ్డిదారిన నిధులు మళ్లించడం చూస్తే.. రాష్ట్ర ఖజానా దుస్థితి తేటతెల్లం అవుతోందని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పంచాయతీలకు అందే 14,15వ ఆర్థిక సంఘం నిధులను ఇతరత్రా అవసరాలకు వినియోగించడం తగదన్నారు. పంచాయతీ నిధులు పూర్తిస్థాయిలో అందలేదని సర్పంచ్‌లు గగ్గోలు పెడుతున్నా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు.

2018 ఆగస్టు 1 నుంచి , 2021 ఏప్రిల్‌ 2 వరకు గ్రామపంచాయతీల ఎన్నికలు జరగకపోవడంతో సర్పంచ్‌లు అధికారంలో లేరని.. ఆ తర్వాత 2021లో ఎన్నికలు జరిగి నూతన సర్పంచ్‌లు అదే ఏడాది ఏప్రిల్‌లో పదవీ బాధ్యతలు స్వీకరించారని శైలజానాథ్ తెలిపారు. మొత్తం 12,918 గ్రామ పంచాయతీల్లో సీఎఫ్ఎంఎస్ ఖాతాల్లో జీరో బ్యాలెన్స్‌ చూపిస్తున్నాయని పేర్కొన్నారు. 7,659 కోట్లు రాష్ట్రానికి విడుదల చేశామని పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి సమాధానమిచ్చారని.. ఆ నిధులు ఏం చేశారో ప్రభుత్వం సమాధానమివ్వాలని శైలజనాథ్ డిమాండ్ చేశారు. ఆదాయ వనరులు లేని పంచాయతీలకొచ్చే అరకొర నిధులు కూడా సచివాలయ నిర్వహణ పేరుతో ప్రభుత్వం వాడేసుకుంటే ఎలాగని ప్రశ్నించారు. రెండున్నరేళ్లలో 12,918 పంచాయ‌తీల నుంచి దారి మళ్లించిన రూ.1,309 కోట్ల నిధులను త‌క్షణ‌మే పంచాయ‌తీ ఖాతాల‌లో జ‌మ‌చేయాలని శైలజనాథ్ డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:Funds Divert: పురపాలికలకు షాక్‌... ఆర్థిక సంఘం నిధులు మళ్లింపు

ABOUT THE AUTHOR

...view details