రాజధాని అమరావతి, కోర్టు వంటి అంశాలతో, మంత్రుల భాషా ప్రావీణ్యంతో వైకాపా ప్రభుత్వం ప్రజా సమస్యలను పక్క దారి పట్టిస్తోందని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ఆరోపించారు. విజయవాడలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, నగర కార్యవర్గంతో ఆయన సమావేశం నిర్వహించారు. సీఎం జగన్ ఆర్ఎస్ఎస్, భాజపా మానస పుత్రుడని... వైకాపా భాజపాకు బ్రాంచ్ ఆఫీస్ అని శైలజానాథ్ విమర్శించారు. కాంగ్రెస్ పథకాలకు పేర్లు మార్చి కొత్త పథకాలుగా వైకాపా ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.
ఏపీలో రాహుల్ ట్రాక్టర్ ర్యాలీ!
వైకాపా, భాజపా రైతు వ్యతిరేకులు కాబట్టే వ్యవసాయ చట్టాలు ఆమోదించాయని శైలజానాథ్ అన్నారు. పంపు సెట్లకు విద్యుత్ మీటర్లు బిగించాలని చేస్తున్న ప్రయత్నాన్ని కాంగ్రెస్ ఖండిస్తోందని ఆయన తెలిపారు. ఈ నెల 31న రైతులకు మద్దతుగా అన్ని జిల్లా కేంద్రాల్లో కిసాన్ దివస్ నిర్వహిస్తామన్నారు. నవంబర్ 1వ తేదీన విజయవాడలో వెనుకబడిన వర్గాలపై దాడులకు మహా ధర్నా నిర్వహిస్తామని... అదే నెలలో రాష్ట్రంలోని సమస్యలపై రాహుల్ గాంధీతో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తామని ప్రకటించారు. ప్రాధాన్యత లేని, నిధులు లేని కార్పొరేషన్లు ఎన్ని ఉన్నా వృధానే అని శైలజానాథ్ విమర్శించారు. ఎస్సీ కార్పొరేషన్‌ను ముక్కలు చేసి ఆ నిధులు ఇతర పథకాలకు మళ్లించారని ఆరోపించారు.
ఇదీ చదవండి:
తెదేపా కమిటీల ప్రకటన... బలహీన వర్గాలకు పెద్దపీట