అసెంబ్లీ వార్షిక బడ్జెట్ సమావేశాలు ఈ నెల 7నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి రోజున ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగించనున్నారు. ఇప్పటివరకూ ఉన్న సమాచారం మేరకు ఆయన వర్చువల్ విధానంలోనే రాజ్‌భవన్ నుంచి ఈ ప్రసంగం చేయనున్నట్లు తెలిసింది. కొవిడ్ నేపథ్యంలో గతేడాది కూడా గవర్నర్ వర్చువల్ విధానంలోనే ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగం పూర్తయ్యాక తొలిరోజు ఉభయ సభలు వాయిదా పడతాయి. రెండో రోజు 8న మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మృతిపట్ల ఉభయ సభల్లో సంతాప తీర్మానం పెట్టనున్నారు. ఈ నెల 11న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శాసనసభలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మార్చి నెలాఖరు వరకూ సమావేశాలు కొనసాగుతాయని అసెంబ్లీ వర్గాలు చెబుతున్నాయి.
రాష్ట్రంలో చేపట్టిన జిల్లాల విభజన గురించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివేదించారు. లోక్‌సభ నియోజకవర్గాల ప్రాతిపదికన జిల్లాలను విభజించనున్నట్లు తెలిపారు. ఈ వ్యవహారంలో ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తులను స్వీకరిస్తున్నామని, వాటిని పరిగణనలోకి తీసుకుని ఆమోదయోగ్యంగానే నూతన జిల్లాల ఏర్పాటు చేయనున్నామని వివరించారు. సీఎం జగన్ సోమవారం బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసి వివిధ అంశాలపై మాట్లాడారు. మొదట రాజ్‌భవన్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి, ఆయన భార్య వైఎస్ భారతి.. గవర్నర్ దంపతులను మర్యాదపూర్వకంగా కలిశారు. తర్వాత ముఖ్యమంత్రి గవర్నర్‌తో మాట్లాడారు. వచ్చే వారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించనున్నందున ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించేందుకు గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. ఈ సమావేశాల సందర్భంగా ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనున్న కొన్ని బిల్లుల వివరాలనూ సీఎం నివేదించినట్లు తెలిసింది. సమావేశంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, రాజ్‌భవన్ సంయుక్త కార్యదర్శి శ్యామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.