విజయవాడకు చెందిన ఓ మహిళకు 11 ఏళ్ల కిందట వివాహమైంది. కుటుంబంతో కలిసి చిత్తూరులో నివాసముంటోంది. తన భర్త చరవాణిలో అసభ్యకరమైన వీడియోలు ఉండటంతో అతన్ని నిలదీసింది. సహించలేని భర్త ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు. భార్యాపిల్లల్ని ఇంట్లోనే వదిలేసి వెళ్లిపోయాడు. కదల్లేని స్థితిలో ఉన్న ఆమె తన తల్లికి ఫోన్ చేసి విషయం తెలిపింది. బాధితురాలి తల్లి వెంటనే మహిళామిత్ర నిర్వాహకుల్ని సంప్రదించింది. స్వచ్ఛంద సంస్థ సాయంతో డీజీపీ గౌతమ్ సవాంగ్‌కి విషయం చెప్పటంతో ఆయన వెంటనే స్పందించారు. దిశ ప్రత్యేక బృందం పర్యవేక్షణలో ఆ మహిళను రక్షించి తల్లి చెంతకు సురక్షితంగా పోలీసులు చేర్చారు.
భార్యను తీవ్రంగా హింసించి... ఇంట్లోనే వదిలేసి! - గృహహింస వార్తలు
తోడుగా ఉండాల్సిన భర్త పశువులా ప్రవర్తించాడు. భార్యపై దాడి చేసి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. లాక్‌డౌన్ వల్ల బయటకు వెళ్లలేని పరిస్థితి ఉండటం వల్ల బాధితురాలు తల్లికి ఫోన్ చేసి విషయం చెప్పింది. తల్లిదండ్రులు స్వచ్ఛంద సంస్థ ద్వారా దిశ కాల్ సెంటర్‌కు ఫోన్ చేయటంతో నిమిషాల వ్యవధిలో పోలీసులు ఆ మహిళను రక్షించారు.
లాక్‌డౌన్ కారణంగా నేరుగా వచ్చి ఫిర్యాదు చేసే అవకాశం లేనందున ఫోన్ ద్వారా సమస్యలను స్వీకరిస్తున్నామని స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు కీర్తి చెప్పారు. అత్యవరమైన కేసులను పోలీసులకు ఆన్లైన్ ద్వారా చేరవేస్తున్నామన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో బాధిత మహిళలను రక్షించేందుకు దిశ అధికారులను సిద్ధం చేశామని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. లాక్‌డౌన్ నేపథ్యంలో గృహహింస ఎక్కువవుతుండటంతో స్వచ్ఛంద సంస్థలు మహిళలకు అండగా నిలుస్తున్నాయి.
ఇదీ చదవండి:అనుమానాస్పద స్థితిలో దంపతుల బలవన్మరణం