ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

OTS ISSUE: ఎప్పుడో కట్టిన ఇళ్లకు... ఇప్పుడెందుకు వసూళ్లు? - ఓటీఎస్‌పై పేదల ఆగ్రహం

OTS ISSUE: టిడ్కో, జగనన్న ఇళ్లు ఉచితంగా ఇస్తున్న ప్రభుత్వం.. నాటి గృహాలకు ఓటీఎస్‌ కట్టించుకోవడమేమిటని రాష్ట్రంలోని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబ్బు తీసుకోకుండానే హక్కు కల్పించొచ్చు కదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఓటీఎస్‌తో 39 లక్షల మందిపై రూ.5,850 కోట్ల భారం పడనుంది. స్వచ్ఛందమంటున్నా.. కిందిస్థాయిలో అధికారులు లక్ష్యాలు పెడుతున్నారు.

OTS ISSUE
OTS ISSUE

By

Published : Dec 10, 2021, 5:14 AM IST

OTS ISSUE: పేదలకు సెంటు ఇంటి స్థలం పేరిట రాష్ట్ర ప్రభుత్వం కొన్ని లక్షల మందికి ఉచితంగా ఇళ్ల పట్టాలు ఇచ్చింది. ఇళ్ల పట్టాల కోసం భూసేకరణకు, చదును చేయడానికి రూ.10 వేల కోట్లకుపైగా ఖర్చు పెట్టామని చెబుతోంది. వాటిలో సుమారు 30 లక్షల ఇళ్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో ఉచితంగా కట్టించి ఇస్తామంటోంది. అలాగే గత ప్రభుత్వ హయాంలో అత్యాధునిక వసతులతో, గేటెడ్‌ కమ్యూనిటీ తరహాలో కట్టిన టిడ్కో ఇళ్లలో.. 300 చదరపు అడుగుల కేటగిరీ గృహాలను లబ్ధిదారులకు పూర్తిగా ఉచితంగా ఇస్తామనీ ప్రకటించింది.

పేదలకు ఇన్ని చేస్తున్నామని చెబుతున్న సర్కారు.. ఎప్పుడో 3, 4 దశాబ్దాలనాడు ప్రభుత్వాలు మంజూరు చేసిన ఇళ్లను కట్టుకున్న నిరుపేదలకు వాటిపై ఉచితంగా ఎందుకు హక్కు కల్పించరు? పేదలకు ఇళ్లపై హక్కు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం అయినప్పుడు టిడ్కో, జగనన్న గృహాల మాదిరిగా... ఉచితంగానే చేయవచ్చు కదా! అని లబ్ధిదారుల్లో పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

స్వచ్ఛందం అంటూనే.. ఓటీఎస్‌ పేరుతో సుమారు రూ.5,850 కోట్ల భారాన్ని ప్రజలపై ఎందుకు మోపుతున్నారనేది చర్చనీయాంశంగా మారింది. ఓటీఎస్‌ పూర్తిగా స్వచ్ఛందమేనని బలవంతమేమీ లేదని ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. ఓటీఎస్‌పై బుధవారం సమీక్ష సందర్భంగానూ ముఖ్యమంత్రి జగన్‌ మరోసారి అదే విషయాన్ని పునరుద్ఘాటించారు. కానీ దిగువ స్థాయిలో మాత్రం అధికారులు, సిబ్బంది ఓటీఎస్‌కు రుసుము చెల్లించాలంటూ లక్ష్యాలు నిర్దేశించి వెంటపడుతున్న ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. ‘ఎన్టీఆర్‌ హయాం నుంచి ప్రభుత్వాలు వివిధ పథకాల కింద మంజూరు చేసిన ఇళ్లను, రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ రుణ సాయంతో నిర్మించుకున్నవారు.. ఇప్పుడు వాటికి ఓటీఎస్‌ కట్టాలనడమేంటి?’ అని పలువురు పేదలు నిలదీస్తున్నారు.

తరాలు మారాక...

రాష్ట్రంలో 1983-2011 మధ్య అనేక లక్షల మంది ప్రభుత్వాలు మంజూరు చేసిన గృహాలను నిర్మించుకున్నారు. అవి కొన్ని ఇళ్లు చేతులు మారిపోయాయి. అనధికార క్రయవిక్రయాలూ జరిగిపోయాయి. అలాంటి వాటిలో 46 లక్షల ఇళ్లకు లబ్ధిదారులు రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ నుంచి అప్పట్లో రుణాలు తీసుకుని తిరిగి చెల్లించలేదని, వారిలో ఏడు లక్షల గృహాల వివరాలు అందుబాటులో లేవని ప్రభుత్వం చెబుతోంది. మిగతా 39 లక్షల మంది ప్రాంతాలవారీగా నిర్దేశించిన రుసుములు చెల్లిస్తే ఆస్తిపై వారికి పూర్తి హక్కు కల్పిస్తామంటోంది. గ్రామాల్లో రూ.10 వేలు, మున్సిపాలిటీల్లో రూ.15 వేలు, కార్పొరేషన్లలో రూ.20 వేలు ఓటీఎస్‌ కింద కట్టాలని చెబుతోంది. ఇళ్లు చేతులు మారి ఉంటే... ఇప్పుడు అనుభవంలో ఉన్నవారు... రెట్టింపు డబ్బు కట్టాలని నిబంధన పెట్టింది. ఒక్కో ఇంటికి సగటున రూ.15,000 చొప్పున వేసుకున్నా.. 39 లక్షల ఇళ్లపై ప్రభుత్వానికి రూ.5,850 కోట్ల ఆదాయం వస్తుంది. అంటే ఆ మేరకు పేదలపై భారం పడినట్లే.

వాళ్లకెందుకు ఉచితంగా ఇవ్వరు?

పేదలకు మేలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమైతే... దశాబ్దాలనాడు ఇళ్లు కట్టుకున్నవారికి వాటిపై ఎందుకు ఉచితంగా హక్కు కల్పించడం లేదని వివిధ వర్గాలవారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పుడు జగనన్న కాలనీల్లో స్థలాలు ఇచ్చిన పేదలకు ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు వెచ్చిస్తోంది. ఆ మొత్తాన్ని గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిగా కేంద్రమే భరిస్తుండగా, పట్టణ ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.30 వేల చొప్పున వెచ్చిస్తోంది. గత ప్రభుత్వం... గేటెడ్‌ కమ్యూనిటీ తరహాలో పేదల కోసం నిర్మించిన టిడ్కో ఇళ్లలో 300 చదరపు అడుగుల నిర్మిత ప్రదేశంగల ఫ్లాట్‌లను లబ్ధిదారులకు పూర్తిగా ఉచితంగా ఇస్తామని ప్రస్తుత సర్కారు ప్రకటించింది. 365 చదరపు అడుగులు, 430 చదరపు అడుగుల విస్తీర్ణంగల ఫ్లాట్‌లకూ భారీ రాయితీలిస్తోంది. ‘టిడ్కో లబ్ధిదారులకు ఉచితంగా ఇళ్లు ఇస్తున్నారు. కొత్తగానూ కొందరికి ఉచితంగా స్థలాలిచ్చి, ఇళ్లు కట్టిస్తున్నారు. కానీ గతంలో ఎప్పుడో గృహాలు నిర్మించుకున్నవారికి మాత్రం కేవలం హక్కు కల్పించేందుకు డబ్బు వసూలు చేస్తారా? ఏమిటీ వివక్ష?’ అనే విమర్శలు వినిపిస్తున్నాయి.

లక్ష్యాలు పెట్టి మరీ వసూళ్లు

ఓటీఎస్‌ నిర్బంధం కాదని, స్వచ్ఛందంగా ముందుకు వచ్చినవారి నుంచే డబ్బు కట్టించుకుంటామని ప్రభుత్వ పెద్దలు పదేపదే చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. ఓటీఎస్‌ రుసుముల వసూళ్లకు వివిధ మార్గాలు అనుసరిస్తున్నారు. జిల్లా కలెక్టర్‌ నుంచి గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగి వరకు ప్రస్తుతం... అదే తమ ప్రాధాన్య కార్యక్రమంగా నిర్దేశించుకున్నారు. గ్రామ/వార్డు సచివాలయాల వారీగా, రోజువారీ లక్ష్యాలు నిర్దేశించారు. లక్ష్యాన్ని చేరుకోని ఉద్యోగులకు మెమోలూ ఇస్తున్నారు.

  • తాజాగా అమలాపురం మున్సిపల్‌ కమిషనర్‌ పట్టణంలోని సచివాలయాల కార్యదర్శులకు మెమోలు జారీ చేశారు. ఓటీఎస్‌ లక్ష్యం చేరుకోనివారిపై చర్యలు తప్పవని, ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేయబోమని హెచ్చరించారు. ‘నవంబరు 29 నుంచి డిసెంబరు 10 వరకు ఓటీఎస్‌పై వారోత్సవాలు నిర్వహించాలని, రోజువారీ లక్ష్యాలు నిర్ణయిస్తూ ఉత్తర్వులిచ్చాం. లక్ష్యాన్ని పూర్తి చేయడంలో వార్డు సెక్రటరీల నిర్లక్ష్య వైఖరి వల్ల అమలాపురం పురపాలక సంఘం సదరు సంక్షేమ పథకం అమలులో వెనుకబడింది. జిల్లా కలెక్టర్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. అది మీరు విధుల పట్ల చూపుతున్న నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం’ అని ఆ మెమోలో కమిషనర్‌ పేర్కొన్నారు.
  • కొన్నిచోట్ల ఇళ్ల పథకం లబ్ధిదారుల్లో డ్వాక్రా మహిళల్ని గుర్తించి పొదుపు మొత్తం నుంచి ఓటీఎస్‌కు మళ్లించే ప్రక్రియ చేపట్టారు.

ఇదీ చదవండి:

PRC Update:ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో సీఎం భేటీ.. పీఆర్సీపై ప్రకటన ఎప్పుడంటే?

ABOUT THE AUTHOR

...view details