హోం మంత్రిగా తానేటి వనిత సచివాలయంలో ఇవాళ బాధ్యతలు చేపట్టారు. జైళ్లల్లో ములాకాత్ వెంటనే అమలయ్యేలా అనుమతిస్తూ.. మొదటి సంతకం చేశారు. ముఖ్యమంత్రి జగన్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని.., ఎలాంటి వివక్షా లేకుండా అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలుపై దృష్టి పెడతాననని అన్నారు. సాంకేతికతని ఉపయోగించి బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ప్రజల సహకారంతో శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు చేపడతామని తానేటి వనిత స్పష్టం చేశారు.
దేవుడి మాన్యాల పరిరక్షణకు కృషి: డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ.. దేవదాయ శాఖ బాధ్యతలు స్వీకరించారు. దేవాలయాలకు భక్తులిచ్చిన మాన్యాల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న ఆలయాల్లో సౌకర్యాలు పెంచుతామని తెలిపారు. కరోనా తర్వాత ఆలయాల్లో భక్తుల రద్దీ పెరిగిందని, వరుస సెలవులతో తిరుమలలో రద్దీ పెరిగిందన్నారు. ఆలయాల్లో మరింత భద్రత పెంచుతామని, ఆలయాల్లో జరుగుతున్న దాడులను కొందరు కావాలనే ప్రేరేపిస్తున్నారని మంత్రి ఆరోపించారు.
చిన్న తప్పు కూడా జరగనివ్వను: సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా మేరుగ నాగార్జున బాధ్యతలు స్వీకరించారు. తనకు మంత్రిగా అవకాశమిచ్చిన సీఎం జగన్‌కు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. అర్హులకు సంక్షేమ పథకాలు అందించే బాధ్యతను సీఎం జగన్ తనకు ఇచ్చారన్నారు. ఎక్కడా చిన్న తప్పుకు తావు లేకుండా మంత్రిగా తన బాధ్యతను నిర్వర్తిస్తానని స్పష్టంచేశారు. అంబేడ్కర్ ఆలోచనతో దళిత సంక్షేమానికి సీఎం జగన్ పెద్దపీట వేస్తున్నారని మంత్రి వ్యాఖ్యానించారు.
వైద్యారోగ్యశాఖకు అధిక ప్రాధాన్యం: వైద్యారోగ్య శాఖకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని ఆ శాఖ మంత్రి విడదల రజని స్పష్టం చేశారు. సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆమె.. మెడికల్ సర్వీసెస్ విషయంలో ఏపీ ఐకాన్‌గా నిలుస్తోందన్నారు. ఏపీలో అందుతున్న వైద్య సేవలకు కేంద్రం నుంచి ప్రశంసలు అందాయని పేర్కొన్నారు. త్వరలో 16 మెడికల్ కాలేజీలు ఏర్పాటు కాబోతున్నాయని, ప్రతి పార్లమెంట్ పరిధిలో మెడికల్ కాలేజీ రాబోతోందని వెల్లడించారు. వచ్చే నెలాఖరులోపు అన్ని మెడికల్ కాలేజీల నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు.
సీఎం ఆశయాలతో ముందుకెళ్తా: సచివాలయంలో ఉపముఖ్యమంత్రిగా, ఎక్సైజ్‌శాఖ మంత్రిగా నారాయణస్వామి బాధ్యతలు చేపట్టారు. ఎక్సైజ్ శాఖలో మరణించిన ఇద్దరు ఉద్యోగులకు మెడికల్ రీయింబర్స్మెంట్ విడుదల చేస్తూ మొదటి సంతకం చేశారు. సీఎం జగన్ ఆశయాలతో ముందుకెళ్తామని నారాయణస్వామి స్పష్టం చేశారు. సెబ్, ఎక్సైజ్ శాఖ సహకారం బాగుందని.., తమ శాఖలో చాలామందిని సస్పెండ్ చేయాల్సి రావడం బాధాకరమన్నారు. గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాల వల్ల ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారని తెలిపారు. అందరి సహకారంతో మద్యపాన నిషేధం చేస్తామని నారాయణస్వామి అన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు దేవుడి చిత్రపటం బదులుగా సీఎం జగన్ చిత్రపటాన్ని నారాయణ స్వామి తీసుకువచ్చారు. బడుగుల దేవుడిగా జగన్ అవతరించారని.., అందుకే ఆయన చిత్రపటానికి పూజలు చేసి బాధ్యతలు స్వీకరించినట్లు మంత్రి నారాయణ స్వామి వెల్లడించారు.
ఇదీ చదవండి: Governor: "అది గొప్ప పథకం... పేదోడి మెరుగైన వైద్యానికి భరోసా..!"