GRMB: గోదావరిపై ప్రాజెక్టుల నిర్మాణానికి తెలంగాణ సమర్పించిన డీపీఆర్‌లను ఆమోదించవద్దని.. గోదావరి నదీ యాజమాన్య బోర్డును ఆంధ్రప్రదేశ్ మళ్లీ కోరింది. నీటి లభ్యతపై అంచనా వేసి ఎవరి వాటా ఎంతో తేలిన తర్వాతే అనుమతించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు శనివారం లేఖ రాశారు. చనాఖా-కొరాటా, చిన్న కాళేశ్వరం(ముక్తేశ్వరం), చౌట్‌పల్లి హనుమంతరెడ్డి ఎత్తిపోతల పథకాల డీపీఆర్‌లను తెలంగాణ.. గోదావరి బోర్డుకు సమర్పించి అనుమతి కోరింది.
ఇటీవల జరిగిన గోదావరి బోర్డు సమావేశంలో దీనిపై చర్చ జరిగి అభిప్రాయం చెప్పిన ఆంధ్రప్రదేశ్, వెంటనే మళ్లీ లేఖ రాసింది. అనుమతి ఇచ్చే ముందు గోదావరిలో నీటి లభ్యతపై సమగ్ర అధ్యయనం చేయాలని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు నీటి లభ్యత ఎంతో తేల్చిన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య ఎవరికి ఎంత అన్నది తేల్చడానికి ట్రైబ్యునల్ ఏర్పాటు ద్వారా కానీ లేదా అంతర్ రాష్ట్ర ఒప్పందం ద్వారా కానీ చేయాలని లేఖలో కోరింది. 2016 జనవరి 21న జరిగిన గోదావరి బోర్డు సమావేశంలో ట్రైబ్యునల్ ఏర్పాటుపై తెలంగాణ కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందని, 2020 అక్టోబరు 6న జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో గోదావరి ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని కోరుతూ జల్‌శక్తి మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేస్తామని కూడా ఏపీ చెప్పిందని వివరించారు.
తెలంగాణ అనధికారికంగా చేపట్టిన ప్రాజెక్టులు గోదావరి ట్రైబ్యునల్‌కు, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి వ్యతిరేకమని, వీటివల్ల దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాజెక్టులపై ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిపింది. మహారాష్ట్ర-తెలంగాణ మధ్య జరిగిన ఒప్పందాలకు దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు సంబంధం లేదని పేర్కొంది. కేంద్ర జల సంఘం లేదా మరో కన్సల్టెన్సీ సంస్థతో నీటి లభ్యతపై అధ్యయనం చేయించాలని కోరింది.