వేతన సవరణ కమిషన్ (పీఆర్‌సీ) నివేదిక కోసం సచివాలయం వేదికగా ఉద్యోగసంఘాల నేతలు నిరసనకు దిగారు. ఏపీ ఐకాస ఛైర్మన్ బండి శ్రీనివాసరావు, ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, మరికొందరు నేతలు.. ఐదున్నర గంటలపాటు పట్టువీడలేదు. బుధవారం మధ్యాహ్నం 4గంటలకు సచివాలయానికి వచ్చిన నేతలు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మను కలిశారు. దీనిపై చర్చించేందుకు సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్తున్నానని, వేచి ఉండాలని సీఎస్ చెప్పారంటూ.. నేతలు రెండో బ్లాకు ముందు ఎదురుచూశారు. చీకటి పడినా స్పందన రాలేదు. దీంతో నివేదిక ఇచ్చేవరకూ కదలబోమని భీష్మించారు. రాత్రి 9.30 వరకూ ఉన్నారు. అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. సచివాలయ భద్రతా సిబ్బంది ఒత్తిడితో అక్కడి నుంచి వెళ్లిపోయారు. సీఎంతో మాట్లాడి బుధవారం పీఆర్‌సీ నివేదిక ఇస్తామని సీఎస్ హామీ ఇచ్చారని, అందుకే తాము ఎదురు చూశామని బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. ఐదున్నర గంటలపాటు తమ సహనాన్ని పరీక్షించారని, తమను చిన్నచూపు చూస్తున్నట్లు భావిస్తున్నామని మండిపడ్డారు. పీఆర్‌సీ నివేదికను ఎందుకు దాచిపెడుతున్నారో అర్థం కావట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను ఇబ్బందులకు గురిచేసిన అధికారులపై ఏం చర్యలు తీసుకోవాలో ప్రభుత్వమే ఆలోచించాలన్నారు. రెండు ఐకాసల్లోని సంఘాలతో గురువారం సమావేశమై కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.
అధికారుల అలసత్వమా.. ప్రభుత్వ తీరే ఇదా?
- బండి శ్రీనివాసరావు
‘ఉద్యోగ సంఘం నాయకులుగా ఈ ప్రభుత్వం అధికారంలోకి రావాలని భావించాం. మేం సానుకూల ధోరణితో సహకరిస్తుంటే అధికారుల అలసత్వమో.. లేక ప్రభుత్వ తీరే ఇలా ఉందో అర్థం కావట్లేదు. పీఆర్‌సీ నివేదిక ఇస్తామన్న సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ అందుబాటులో లేకపోవడంతో సీఎస్‌ను కలిశాం. ఈ అంశంపై సీఎంతో చర్చ జరుగుతోందని చెప్పగా.. సీఎస్‌పై గౌరవంతో ఎదురుచూశాం. అనంతరం సీఎస్ ఓఎస్డీకి ఫోన్ చేయగా.. శశిభూషణ్‌కుమార్ వచ్చి మాట్లాడతారని చెప్పారు. చివరకు ఆయనా సంప్రదించలేదు. మేం ఫోన్ చేసినా స్పందించలేదు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఇచ్చిన హామీలు అమలు కావట్లేదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. నివేదిక ఇస్తే భవిష్యత్తులో ఏం చేయాలో నిర్ణయించుకుంటాం. భద్రతా సిబ్బందికి సహకరించాలనే వెళ్లిపోతున్నాం.’
నివేదికలో అంత రహస్యం ఏముంది
- బొప్పరాజు
‘పీఆర్‌సీ నివేదిక ఇస్తామంటూ కనీస గౌరవం ఇవ్వకుండా ఐదున్నర గంటలపాటు మా సహనాన్ని పరీక్షించారు. నివేదిక ఇస్తారా లేదా అనే మాటే చెప్పలేదు. అధికారుల నిర్లక్ష్యాన్ని ఖండిస్తున్నాం. పీఆర్‌సీ నివేదిక కోసం ఏడాదిన్నర నుంచి ఎదురుచూస్తున్నాం. నివేదిక ఇచ్చేందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారంటే ఆలోచించాలి. అందులో రహస్యం ఏముంది? ఉద్యోగుల దాచుకున్న డబ్బులు ఇవ్వకపోగా.. పీఆర్‌సీని జాప్యంచేయడం దారుణం. ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తోందో అర్థమవ్వడంలేదు. విద్య, వైద్యశాఖల్లో సమస్యల పరిష్కారానికి సమావేశం పెట్టాలని కోరినా చర్యల్లేవు. మేం సహనంతో ఎదురుచూస్తున్నాం తప్ప.. నిందించడం లేదు. ఉద్యోగ సంఘాలతో దూరం పెరిగేలా వ్యవహరిస్తున్న అధికారులపై ప్రభుత్వం ఆలోచించాలి.’
జాప్యం దురదృష్టకరం
- ఏపీ ఐకాస, ఏపీ ఐకాస అమరావతి ప్రధాన కార్యదర్శులు హృదయరాజు, వైవీ రావు