ప్రధాని మోదీ దిల్లీలో ప్రారంభించిన పీఎం గతిశక్తి కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వర్చువల్గా పాల్గొన్నారు. మౌలిక సదుపాయాల మాస్టర్ ప్లాన్లో భాగంగా.. దేశవ్యాప్తంగా రహదారులు, రైల్వే ఫ్రైట్ కారిడార్లు, ఎకనామిక్ కారిడార్లు, పోర్టుల ద్వారా సరకు రవాణాను వేగవంతం చేయటమే లక్ష్యంగా కేంద్రం ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చిందని మంత్రి అన్నారు. మౌలికవసతుల కల్పనకు రాష్ట్రంలోనూ పెద్దపీట వేసినట్లు మంత్రి తెలిపారు.
దేశవ్యాప్తంగా పీఎం గతిశక్తి ప్రాజెక్ట్ కోసం రూ. 100 లక్షల కోట్లను కేంద్రం దశలవారీగా ఖర్చు చేయనుందని గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, స్థానిక ఉత్పత్తులను ప్రపంచ స్థాయిలో నిలబెట్టే దిశగా ఏపీ గతిశక్తికి తగినట్టుగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. 'వోకల్ ఫర్ లోకల్' ద్వారా ప్రపంచంతో పోటీ పడే స్థాయికి వ్యాపార, పారిశ్రామికవేత్తలు ఎదగడానికి కేంద్ర ప్రభుత్వం సాగరమాల, భారతమాల, ల్యాండ్ పోర్ట్స్, ఉడాన్ తరహాలోనే పీఎం గతిశక్తిని ప్రారంభించిందని మంత్రి గౌతం రెడ్డి అన్నారు.