బ్రహ్మంగారి మఠంపై దాఖలైన పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. మఠాధిపతిగా తమను గుర్తించాలని దివంగత పీఠాధిపతి శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి రెండో భార్య మారుతి మహాలక్ష్మి, ఆమె కుమారుడు గోవిందస్వామి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మఠాధిపతి విషయంలో దేవాదాయశాఖ జోక్యం చేసుకుందని, తమను బలవంతంగా ఒప్పించారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. ఉత్తర్వులు జారీ చేసే అధికారం దేవాదాయ ప్రత్యేక కమిషనర్‌కు లేదన్నారు.
మఠానికి సంబంధించిన విషయంలో ధార్మిక పరిషత్ జోక్యం చేసుకుంటుందన్నారు. మఠాధిపతి విషయంలో ధార్మిక పరిషత్ తీర్మానం చేసిందని.. దాని ప్రకారమే తాత్కాలిక మఠాధిపతిగా ప్రత్యేక అధికారిని నియమించామని ప్రభుత్వం తరపు న్యాయవాది ధర్మాసనానికి వివరించారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. శుక్రవారం తీర్పును వెలువరించనున్నట్లు హైకోర్టు తెలిపింది.