ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

HC On Social Media Case: న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యల కేసులో.. నిందితులపై లుక్​ అవుట్ నోటీసులు - సామాజిక మాధ్యమాల్లో పోస్టుల కేసుపై హైకోర్టు విచారణ

న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దిగజారుస్తూ.. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడంపై అప్పటి ఇంచార్జీ రిజిస్ట్రార్ జనరల్ దాఖలు చేసిన వ్యాజ్యంపై ధర్మాసనం(AP High court on Social Media Case) విచారణ చేపట్టింది. పంచ్ ప్రభాకర్​ను అరెస్టు చేసేందుకు 'లుక్ అవుట్ ' నోటీసులు జారీచేసినట్లు సీబీఐ డైరెక్టర్ ఎస్కే జైశ్వాల్ తెలిపారు. ఈమేరకు కేసుకు సంబంధించి వివరాలతో (Social Media Case)అఫిడవిట్ దాఖలు చేశారు.

HC On Social Media Case
సామాజిక మాధ్యమాల్లో పోస్టుల కేసుపై హైకోర్టు విచారణ

By

Published : Nov 26, 2021, 7:58 AM IST

న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెడుతూ అపకీర్తిపాల్జేస్తున్న పంచ్‌ప్రభాకర్‌ను భారతదేశానికి వచ్చినప్పుడు అదుపులోకి తీసుకునేందుకు కేంద్ర హోంశాఖ ఈనెల 1న ‘లుక్‌ అవుట్‌’ సర్క్యులర్‌ జారీచేసినట్లు సీబీఐ డైరెక్టర్‌ సుబోధ్‌ కుమార్‌ జైస్వాల్‌ హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారు. ఇంటర్‌ పోల్‌ జారీచేసిన బ్లూ నోటీసు ఆధారంగా చీనేపల్లి ప్రభాకర్‌రెడ్డి(పంచ్‌ప్రభాకర్‌) అమెరికాలోని న్యూజెర్సీ, మాంట్‌విల్లీలో నివాసం ఉంటున్నట్లు చిరునామాను ఎఫ్‌బీఐ ధ్రువీకరించిందన్నారు. ప్రభాకర్‌ అరెస్ట్‌ కోసం ఈ ఏడాది నవంబర్‌ 8న నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌(ఎన్‌బీడబ్ల్యూ) తీసుకున్నామని తెలిపారు. ఈనెల 9న ప్రభాకర్‌ను అరెస్టు చేసేందుకు ఇంటర్‌పోల్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌కు విజ్ఞప్తి చేశామన్నారు. ప్రభాకర్‌ పాస్‌పోర్టుకు సంబంధించిన దస్త్రాలను హైదరాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ కార్యాలయం నుంచి పొందామని చెప్పారు. ఆయన యూఎస్‌ పౌరసత్యం పొందిన నేపథ్యంలో న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్‌ జనరల్‌ అతని పాస్‌పోర్టును 2015 జనవరిలో సస్పెండ్‌ చేశారన్నారు.

పంచ్‌ప్రభాకర్‌ న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చేలా యూట్యూబ్‌ ఛానల్లో వీడియోలు(Objectionable posts in social media on the judiciary and judges) పోస్టు చేస్తునట్లు కనుగొన్నామని తెలిపారు. దీంతో తాము నమోదు చేసిన కేసులో ప్రభాకర్‌ 17వ నిందితుడని వివరిస్తూ.. ఆయన అప్‌లోడ్‌ చేస్తున్న వీడియోలను తొలగించేలా యూట్యూబ్‌ను ఆదేశించాలని కోరారు. న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దిగజారుస్తూ పోస్టింగ్‌లు పెట్టడంపై అప్పటి హైకోర్టు ఆర్‌జీ దాఖలు చేసిన వ్యాజ్యంపై ధర్మాసనం విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాలమేరకు సీబీఐ డైరెక్టర్‌ ఎస్‌కే జైశ్వాల్‌ ఈ కేసు వివరాలను అఫిడవిట్‌ రూపంలో కోర్టుముందు ఉంచారు.

అఫిడవిట్‌లో వివరాలు ఇవే..

‘అభ్యంతరకర పోస్టుల వ్యవహారంపై గుర్తించిన 16మందితో పాటు, మరికొందరిపై కేసు నమోదు చేశాం. అందులో 11మంది నిందితులు అరెస్ట్‌ చేశాం. ఇందులో ధనిరెడ్డి కొండారెడ్డి, పాముల సుధీర్‌ తదితరులు ఉన్నారు. ఇతర నిందితులైన మణి అన్నపురెడ్డి, అభిషేక్‌రెడ్డి, గునపనేని లింగారెడ్డి, చందురెడ్డి, చిరంజీవి, పంచ్‌ప్రభాకర్‌కు సంబంధించిన సామాజిక మాధ్యమాల అకౌంట్ల వివరాలు ఇవ్వాలని ఆయా సంస్థలను కోరాం. అమెరికాలో ఉన్న మణి అన్నపురెడ్డి అరెస్ట్‌ కోసం వారెంట్‌ పొందాం. గునపనేని లింగారెడ్డి కోసం కేంద్రం లుక్‌అవుట్‌ నోటీసులు జారీచేసింది’

ఎంపీ నందిగం సురేశ్‌ను విచారించాం

‘ఈ వ్యవహారం వెనుక భారీ కుట్రకోణం ఏమైనా ఉందా అనే విషయాన్ని తేల్చేందుకు ఇతర అనుమానితులైన వైకాపా సోషల్‌ మీడియా ఇంఛార్జి గుర్రంపాటి దేవేంద్రరెడ్డిని ఈ ఏడాది ఆగస్టు 2న విచారించాం. ఆయనతో పాటు షేక్‌ ఖాదర్‌, గుంట రమేశ్‌ను విచారించి వారి ఫోన్లను సీజ్‌చేసి హైదరాబాద్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపాం. ఇతర అనుమానితులైన బాపట్ల వైకాపా ఎంపీ నందిగం సురేశ్‌, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌, న్యాయవాది కళానిధి గోపాలకృష్ణ, డాక్టర్‌ ఆర్‌.గోపి, గడ్డం ఉమ, కరణం వేణుగోపాలరావు, దుడ్ల ప్రేమ్‌చంద్‌, వైకాపా అధికార ప్రతినిధి కె.రవిచంద్రారెడ్డి, డాక్టర్‌ రాయుడి గోపి, అర్జున్‌ రవీంద్రరెడ్డి, మట్టా సతీష్‌కుమార్‌ను విచారించాం. ఈ విషయంలో వేగవంతమైన దర్యాప్తుకు సహకరించాలంటూ ఎఫ్‌బీఐ అధికారులతో సీబీఐ వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించింది. క్లిష్టమైన సైబర్‌ నేరాలను పరిష్కరించే దిశగా సీబీఐకి అనుబంధంగా పనిచేస్తున్న సైబర్‌ క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ డివిజన్‌కు ఈ వ్యవహారాన్ని బదిలీ చేశాం. సీబీఐ కోరిన వెంటనే పోస్టులు పెట్టినవారి వివరాలను తక్షణం ఇవ్వడంతోపాటు.. తాము నోటీసులు ఇచ్చిన వాటి విషయంలో వెంటనే అభ్యంతరకర పోస్టులను తొలగించేలా ఆదేశాలు జారీచేయండి. పోస్టులను మళ్లీమళ్లీ పెడుతున్నవారి అకౌంట్లను శాశ్వతంగా తొలగించేలా సామాజిక మాధ్యమాలను ఆదేశించండి’ అని అఫిడవిట్‌లో సీబీఐ డైరెక్టర్‌ కోరారు.

ఇదీ చదవండి:NIMMAGADDA : "జగన్ అక్రమాస్తుల కేసు నుంచి.. నా పేరు తొలగించండి"

ABOUT THE AUTHOR

...view details