రాష్ట్రంలో ఈనెల 8వ తేదీన జరగనున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేస్తూ మంగళవారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఈ ఎన్నికల నిమిత్తం ఈనెల 1న ఎస్‌ఈసీ ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా జరిగే తదుపరి చర్యలన్నింటినీ ఆపేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరిస్తూ తాజాగా ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి.. ఆ వివరాలతో ఈనెల 15న హైకోర్టులో అఫిడవిట్ వేయాలని పేర్కొంది. దానిని పరిగణనలోకి తీసుకొని న్యాయస్థానం తదుపరి ఉత్తర్వులు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు మంగళవారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ఎన్నికల కోడ్ విధించే విషయంలో సుప్రీం ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ ఎస్‌ఈసీ ఈనెల 1న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ నిమిత్తం నోటిఫికేషన్ జారీ చేసిందని పేర్కొంటూ తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య హైకోర్టులో వ్యాజ్యం వేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇటీవల వరుసగా విచారణ జరిపిన న్యాయమూర్తి మంగళవారం తన నిర్ణయాన్ని వెల్లడించారు.
‘పోలింగ్ తేదీకి నాలుగు వారాల ముందు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని విధించాలని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా పేర్కొందని హైకోర్టు తెలిపింది. కోడ్ విధించే విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల్ని ఎస్‌ఈసీ అనుసరించలేదని ఆక్షేపించింది. ఆ ఉత్తర్వులను తోసిపుచ్చుతూ ఎస్‌ఈసీ ఏకపక్షంగా సొంత నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఎన్నికలు నిర్వహించడం అలంకారప్రాయ తంతుకాదని హితవు పలికింది. సాధారణమైన వ్యక్తి ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకొని నచ్చిన అభ్యర్థి, పార్టీని ఎన్నుకునేలా ఎన్నికలు ఉండాలని ‘విన్‌స్టన్ చర్చిల్’ చెప్పిన విషయాన్ని గుర్తు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశించిన మేరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి(కోడ్) పోలింగ్ తేదీకి 4 వారాల ముందు విధించకపోతే.. పోటీదారులందరికీ సమానమైన అవకాశం కల్పించామని చెప్పుకునే నైతిక హక్కు రాష్ట్ర ఎన్నికల సంఘానికి(ఎస్‌ఈసీ) ఉండదని చెప్పింది. తద్వారా ఎన్నికల ప్రక్రియ అంతా నీరుగారిపోతుందని పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్‌ఈసీ చర్యలు లేవని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికలకు అవరోధం కలుగుతుందని వెల్లడించింది. సాధారణంగా ఎన్నికల నిర్ణయాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోనప్పటికీ.. ప్రస్తుత వ్యవహారంలో ఎస్‌ఈసీ నిర్ణయంపై తప్పనిసరిగా జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపింది. ఎన్నికల విషయంలో అధికరణ 226 కింద న్యాయ సమీక్ష చేయకూడదనడం అవాస్తవం అని పేర్కొంది.
ఎస్‌ఈసీ, ప్రభుత్వ వాదనలతో ఏకీభవించలేం
‘4 వారాల ముందు కోడ్ విధించాలన్న సుప్రీం ఆదేశాలు గరిష్ఠ కాలపరిమితి మాత్రమేనన్న ఎస్‌ఈసీ, రాష్ట్ర ప్రభుత్వ వాదనలతో ఏకీభవించలేం. రాజ్యాంగబద్ధ న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులకు కట్టుబడి ఉండాల్సిన అవసరం అందరిపై ఉంది. రాజ్యాంగబద్ధ అథార్టీగా ఎస్‌ఈసీ.. సుప్రీం ఆదేశాలను నిరాకరించడానికి వీల్లేదు. ఆ ఆదేశాల్ని అమలు చేయడం తప్ప ఎస్‌ఈసీకి మరో మార్గం లేదన్న పిటిషనర్ వాదనతో ఏకీభవిస్తున్నాం. నాలుగు వారాల ముందు కోడ్ అమలు చేసే విషయంలో ఇబ్బంది ఎదురైతే ఎస్‌ఈసీ సుప్రీంకోర్టు నుంచి తగిన ఆదేశాలు పొంది ఉండాల్సింది. కోడ్ విధించడం ద్వారా అందరికి సమానమైన అవకాశాలు కల్పించేలా, బరిలో ఉన్న వాళ్లందరూ నియమావళిని పాటించేలా చూడాలి. సామాన్యుడు ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునే వాతావరణాన్ని కల్పించాలి’ అని హైకోర్టు పేర్కొంది.
సుప్రీం ఉత్తర్వులను ఉల్లంఘించడమే