విజయవాడ తూర్పు నియోజకవర్గం తెదేపా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్రావు రుసుము చెల్లించి అనుమతి తీసుకొని హోర్డింగ్ ఏర్పాటు చేస్తే ఏకపక్షంగా ఎలా తొలగిస్తారని పురపాలక శాఖ, ఏపీఐఐసీ అధికారులను హైకోర్టు ప్రశ్నించింది. ఆయన ఏర్పాటు చేసిన హోర్డింగ్ విషయంలో ఈ ఏడాది ఆగస్టు 31 వరకు జోక్యం చేసుకోవద్దని తేల్చిచెప్పింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎఎస్ సోమయాజులు ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు.
HC: అక్కడ హోర్డింగ్ విషయంలో అప్పటి వరకు జోక్యం చేసుకోవద్దు: హైకోర్టు - గద్దె రామ్మోహన్ పిటిషన్ తాజా వార్తలు
కేవలం ప్రతిపక్ష ఎమ్మెల్యే అన్న కారణంతోనే విజయవాడ ఆటోనగర్‌లో తాను ఏర్పాటు చేసిన కరోనా హోర్డింగ్‌ను మున్సిపల్ అధికారులు తొలగించారని గద్దె రామ్మోహన్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ధర్మాసనం విచారణ జరిపింది.
కొవిడ్ నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేస్తూ తెదేపా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు విజయవాడలోని ఆటోనగర్, సిద్ధార్థ కళాశాల సమీపంలో హోర్డింగ్ ఏర్పాటు చేశారు. అందుకు రుసుము చెల్లించి అనుమతి తీసుకున్నారు. ఏపీఐఐసీ అధికారులు హోర్డింగ్‌ను తొలగించడాన్ని సవాలుచేస్తూ ఎమ్మెల్యే హైకోర్టును ఆశ్రయించారు. న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపిస్తూ ఆగస్టు 31 వరకు హోర్డింగ్ ఏర్పాటుకు అనుమతి ఉందన్నారు. పిటిషనర్ ఫోటోతోపాటు ప్రతిపక్షనేత , మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ఫోటో ఫ్లెక్సీలో ఉండటంతో దురుద్దేశపూరితంగా హోర్డింగ్‌ను తొలగించారన్నారు. వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి అనుమతి తీసుకొని, రుసుము చెల్లించి హోర్డింగ్ ఏర్పాటు చేశాక తొలగించడం సరికాదన్నారు. పిటిషనర్ ఏర్పాటు చేసిన హోర్డింగ్ విషయంలో జోక్యం చేసుకోవద్దని అధికారులను ఆదేశించారు. అనంతరం విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు.
ఇదీ చదవండి : TTD Board Members Case: 'స్టే' ఉన్నప్పుడు ఆర్డినెన్స్ ఎలా తీసుకొచ్చారు: హైకోర్టు