దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో చక్కటి ఫలితాలు వచ్చాయని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. గ్రీన్ ఎనర్జీకి సంబంధించి.. లక్షా 25 వేల కోట్ల రూపాయల పెట్టుబడులపై అదానీ, గ్రీన్‌కో, అరబిందోలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించింది. పంప్డ్ స్టోరేజీ వంటి వినూత్న విధానాలతో 27 వేల 700 మెగావాట్ల క్లీన్ ఎనర్జీ రాష్ట్రంలో అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది. ఆర్సెలర్ మిట్టల్ సంస్థ తొలిసారిగా గ్రీన్ ఎనర్జీలో పెట్టుబడులకు... ఏపీని వేదికగా చేసుకుందని ప్రభుత్వం పేర్కొంది. కర్బన రహిత పారిశ్రామికీకరణకు ఏపీ కేంద్రంగా నిలుస్తోందని నీతి ఆయోగ్ సీఈవో కితాబిచ్చారని చెప్పింది.
మచిలీపట్నంలో ఒక సెజ్‌ను (S.E.Z) తీసుకురానుండటం... దావోస్ ఫలితాల్లో ఒకటని ప్రభుత్వం తెలిపింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో ఏస్ అర్బన్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఒప్పందం చేసుకుందని వెల్లడించింది. గ్రీన్ ఎనర్జీని వినియోగించుకోవడంతోపాటు.. అత్యాధునిక పద్ధతుల్లో ఉత్పత్తులు సాధించేందుకు వీలుగా ఈ జోన్‌ను అభివృద్ధి చేస్తారని తెలిపింది. దీనికి సంబంధించి డబ్య్లూఈఎఫ్తో ఒప్పందం చేసుకుందని.. తెలిపింది. రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి అత్యాధునికతను, కాలుష్యంలేని విధానాలను జోడించడానికి.. డబ్య్లూఈఎఫ్ తగిన సహకారం అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటనలో పేర్కొంది.
రాష్ట్రంలోకి కొత్తగా 4 పోర్టులు రానున్న దృష్ట్యా.. పోర్టు ఆధారిత పారిశ్రామికీకకణపైనా దావోస్ సదస్సులో సీఎం జగన్ దృష్టిపెట్టారని ప్రభుత్వం పేర్కొంది. దస్సాల్ట్ సిస్టమ్స్, మిట్సుయి వోఎస్కే లైన్స్‌తో జరిగిన చర్చల్లో సీఎం ఇవే అంశాలపై దృష్టిసారించారని తెలిపింది. సముద్ర మార్గం ద్వారా రవాణాను 3 రెట్లు పెంచే ఉద్దేశంతో.. ఇది వరకే ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ పాలసీని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని ఆ వివరాలను సంస్థల ముందు ఉంచినట్లు వెల్లడించింది. త్వరలో కాకినాడ పోర్టులో కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు మిట్సుయి వోఎస్కే లైన్స్ సంస్థ సీఈవో తకీషి హషిమొటో ప్రకటించారని ప్రభుత్వం తెలిపింది.