ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 24, 2021, 4:02 AM IST

ETV Bharat / city

ఎయిడెడ్‌ విద్యా సంస్థలను ప్రభుత్వమే తీసుకుంటుంది.. అంగీకరించకపోతే?

రాష్ట్రంలో ఎయిడెడ్‌ విద్యాసంస్థల వ్యవస్థ కనుమరుగు కానుంది. ప్రస్తుతం ఎయిడెడ్‌లో కొనసాగుతున్న వాటిని ప్రైవేటుగా నిర్వహించుకోవడం.. లేదంటే ప్రభుత్వానికి అప్పగించే విధానంపై ఉన్నత విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.

ap govt on aided educational education institutions
ap govt on aided educational education institutions

ఎయిడెడ్ విద్యాసంస్థల భవనాలు, భూములు సహా యాజమాన్యాలు పూర్తిగా అప్పగిస్తే ప్రభుత్వమే నిర్వహిస్తుంది. లేదంటే యాజమాన్యాలు ప్రైవేటుగా నిర్వహించుకునే అవకాశం కల్పించాలని భావిస్తోంది. ఇందుకు అవసరమైన చట్ట సవరణకు చర్యలు చేపట్టింది. పాఠశాలల నుంచి ఉన్నత విద్యాసంస్థల వరకు ఈ ప్రక్రియ బాధ్యతను ఉన్నత విద్యాశాఖకు ప్రభుత్వం అప్పగించింది. ఈ ప్రతిపాదనలు తుదిదశకు చేరాయి. యాజమాన్యాలు ప్రైవేటుగా నిర్వహించుకుంటామని నిర్ణయిస్తే ఆయా సంస్థల్లో ప్రభుత్వ వేతనాలతో పని చేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందిని వెనక్కి తీసుకొని ప్రభుత్వ సంస్థల్లో నియమిస్తారు. ఈ నెల 12న సీఎం అధ్యక్షతన నిర్వహించిన ఉన్నతవిద్య సమీక్షలో ఎయిడెడ్‌ సంస్థల ప్రస్తావన రాగా.. పూర్తిగా అప్పగిస్తే ప్రభుత్వమే నడపాలని, లేనిపక్షంలో ప్రైవేటు యాజమాన్యాలే నిర్వహించుకోవాలనే నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు అనుగుణంగా చర్యలు కొనసాగుతున్నాయి.

.

బోధన సిబ్బంది ఇలా..
రాష్ట్రవ్యాప్తంగా ఎయిడెడ్‌లో ప్రభుత్వ వేతనాలతో... పాఠశాలల్లో 7,298, జూనియర్‌ కళాశాలల్లో 721, డిగ్రీ స్థాయిలో 1,347 మంది పని చేస్తున్నారు. ఒకవేళ నిర్వహణ బాధ్యతలను యాజమాన్యాలకు అప్పగిస్తే వీరందర్నీ వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది. డిగ్రీ కళాశాలల్లో 1,100 మంది పార్ట్‌టైం కింద పని చేస్తున్నారు. వీరంతా తమను రెగ్యులర్‌ చేయమని కొంతకాలంగా కోరుతున్నారు. నిర్వహణ ప్రైవేటు సంస్థలకు ఇచ్చేస్తే వీరి పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. జూనియర్‌ కళాశాలకు కొత్తగా 721 మంది లెక్చరర్లు రావడంతో ఇప్పటి వరకు పని చేస్తున్న పార్ట్‌టైం, అతిథి అధ్యాపకులపై ప్రభావం పడనుంది.
భవనాలు యాజమాన్యాలకే..
కొన్ని విద్యాసంస్థలకు దాతలు భూములు ఇవ్వగా, కొన్నిచోట్ల ప్రభుత్వం తక్కువ ధరకు కేటాయించింది. ఉన్నత విద్యాసంస్థల్లో విశ్వవిద్యాలయాల నిధుల సంఘం, రూసా నిధులతో చాలా వరకు భవనాలు నిర్మించారు. ప్రభుత్వ నిధులతో వీటిని నిర్మించినప్పటికీ యాజమాన్యాలకే ఇచ్చేయనున్నారు. ప్రభుత్వానికి ఇచ్చేందుకు ఎన్ని సంస్థలు సిద్ధంగా ఉన్నాయని గతంలో అధికారులు వివరాలు సేకరించగా.. 10లోపు యాజమాన్యాలే ముందుకు వచ్చాయి. మిగతావారు తామే నిర్వహించుకునేందుకు ఆసక్తి చూపారు.
ప్రభుత్వమే నిర్వహిస్తుంది
రాజమహేంద్రవరంలోని కందుకూరి వీరేశలింగం, నెల్లూరులోని సర్వోదయ, వి.ఆర్‌.కళాశాలలు లాంటివి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. వీటి భవనాలు, భూములు ప్రభుత్వానివే. నిర్వహణను ట్రస్టు చూస్తోంది. అవసరమైతే వీటిని విద్యాశాఖే నిర్వహించాలని భావిస్తోంది. దీనిపై ఇంతవరకు పూర్తి నిర్ణయం తీసుకోలేదు.
విద్యార్థులపై భారం
కొన్ని ఎయిడెడ్‌ సంస్థలు పేదలకు విద్యను అందిస్తున్నాయి. కొన్నింటిలో వసతిగృహాలూ ఉన్నాయి. ఇలాంటి వాటిని యాజమాన్యాలే తీసుకుంటే నిర్వహణ కోసం విద్యార్థుల నుంచి అధికంగా ఫీజులు వసూలు చేయాల్సి వస్తుందని, ఇక్కడ చదువుతున్న వారిపై భారం పడుతుందని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. ఎయిడెడ్‌ సంస్థలు ఉన్న చోట్ల ప్రభుత్వ విద్యాసంస్థలను ఏర్పాటు చేయలేదు. ఇప్పుడు అవి ప్రైవేటు పరమైతే ప్రభుత్వ సంస్థల్లో ప్రవేశాల కోసం విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది.
భూముల అమ్మకంపై..
కొన్ని ఎయిడెడ్‌ సంస్థల ఆధ్వర్యంలోని భూముల విలువ రూ.కోట్లలో ఉంది. గతంలో పట్టణాల శివారుల్లో ఉన్న ఈ విద్యాసంస్థలు ఇప్పుడు మధ్యలోకి వచ్చాయి. ఫలితంగా భూముల విలువ అమాంతం పెరిగింది. ప్రైవేటులో నిర్వహించుకునేందుకు అనుమతులు ఇచ్చినా భూములు, భవనాల అమ్మకంపై ప్రభుత్వం నిషేధం విధించనుంది. ప్రభుత్వ అనుమతి లేకుండా అమ్మకూడదనే నిబంధనను తీసుకొస్తున్నారు.

ఇదీ చదవండి:దుర్గగుడిలో అక్రమార్కులపై వేటు.. 15మంది ఉద్యోగుల సస్పెన్షన్

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details