ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Employees Agitation: డిమాండ్ల సాధన కోసం ఉద్యోగుల ఉద్యమ బాట.. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు

Employees Agitation: డిమాండ్ల సాధన కోసం.. ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమ బాట పట్టారు. నల్ల బ్యాడ్జీలు ధరించి జిల్లాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఆ బ్యాడ్జీలతోనే విధులకు హాజరయ్యారు. పీఆర్సీ సహా ప్రభుత్వం ముందు ఉంచిన 71 సమస్యల్ని పరిష్కరించాల్సిందేనని డిమాండ్ చేశారు.

డిమాండ్ల సాధన కోసం ఉద్యోగుల ఉద్యమ బాట
డిమాండ్ల సాధన కోసం ఉద్యోగుల ఉద్యమ బాట

By

Published : Dec 7, 2021, 8:41 PM IST

Updated : Dec 8, 2021, 6:00 AM IST

Employees Agitation: సమస్యలు పరిష్కరించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు నిరసనలకు దిగారు. కర్నూలులో ఉద్యోగ సంఘాల నాయకులు నల్లబ్యాడ్జీలు ధరించి ప్రదర్శన నిర్వహించారు. ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు..ఈ నిరనస కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వం డిమాండ్లు పరిష్కరించకుంటే..సమ్మె బాట పడతామని హెచ్చరించారు. ఉద్యోగ సంఘాల్ని అణచివేయాలని చూస్తే.. ఊరుకోబోమన్నారు. ఉద్యోగుల 71 డిమాండ్లలో ఒక్క పీఆర్సీపై మాత్రమే సీఎం జగన్‌.. స్పందించారని మిగిలిన వాటి పరిస్థితి ఏంటని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ప్రశ్నించారు. విశాఖలో ఉద్యోగ సంఘాల నిరసనలో పాల్గొన్న ఆయన.. పీఆర్సీ నివేదికను ప్రభుత్వం ఎందుకు దాచిపెడుతోందని నిలదీశారు.

డిమాండ్ల సాధన కోసం ఉద్యోగుల ఉద్యమ బాట

పీఆర్సీ అమలును డిమాండ్ చేస్తూ విజయవాడలో ఉద్యోగ సంఘాలన్నీ ప్రభుత్వ కార్యాలయాల్లో నల్లబాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. జలవనరుల శాఖ కార్యాలయం వద్ద ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. ప్రజా రవాణ శాఖ ఉద్యోగులంతా ఆర్టీసీ డిపోల ఎదుట ఆందోళన చేపట్టారు. రవాణాశాఖ కార్యాలయంలోకి వెళ్లిన ఉద్యోగ సంఘాల నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు. ఉద్యోగులను కలిసేందుకు అనుమతి ఇవ్వకపోవటంతో కొద్దిసేపు ఉద్యోగ సంఘాలు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఉద్యోగులు, పింఛన్‌దారులపై ప్రభుత్వం మోసపూరిత విధానాలు దారుణమంటూ.. గుడివాడలో ఉద్యోగులు నిరసన తెలిపారు. న్యాయమైన తమ సమస్యల్ని పరిష్కరించాలంటూ.. ఉద్యోగ సంఘాలు గుంటూరు జిల్లా కలెక్టరేట్‌లో నిరసన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ..ఏలూరులో ఏపీ జేఏసీ, అమరావతి జేఏసీ ఉద్యోగ సంఘాలు నిరసన ప్రదర్శన నిర్వహించాయి. ఏలూరు కార్పొరేషన్ ఉద్యోగులు తాగునీటి పంపుల చెరువు వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. అనంతరం ఉద్యోగ సంఘాల నాయకులు ఏలూరు ఆర్టీసీ డిపో వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టారు. నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. అనంతపురంలోని డీఎంహెచ్​వో కార్యాలయంలో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. డిమాండ్లు పరిష్కరించాలంటూ..నినాదాలు చేశారు. హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యసిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. పీఆర్సీ అమలు చేసి, బకాయిపడ్డ ఏడు డీఏలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కడప కలెక్టరేట్‌లోని వివిధ శాఖల ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతోనే విధులు నిర్వహించారు. నెల్లూరు నీటిపారుదలశాఖ కార్యాలయంలో ఉద్యోగులు నిరసన చేపట్టారు. ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు.

ముఖ్యమంత్రి జగన్‌ ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ.. విశాఖ జిల్లా పాడేరు డివిజన్‌ ఉద్యోగుల సంఘం ఆందోళన చేపట్టింది. సీపీఎస్‌ రద్దు చేసి.. డీఏలు వెంటనే విడుదల చేయాలని, పీఆర్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు.

నల్లబ్యాడ్జీలతో.. నిరసన..

ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పింఛనుదారులు పోరుబాట పట్టారు. పీఆర్‌సీ సహా మొత్తం 71 ఆర్థిక, ఆర్థికేతర డిమాండ్లు నెరవేర్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ నిరసనకు దిగారు. తొలిదశ ఉద్యమంలో భాగంగా మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు, పాఠశాలల్లో ఉపాధ్యాయులు, పలు సంఘాలకు చెందిన ఆర్టీసీ కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. మండల, తాలూకా, డివిజన్‌, జిల్లా స్థాయి కార్యాలయాలు మొదలు రాష్ట్రస్థాయిలోని శాఖాధిపతుల కార్యాలయాల వరకూ అన్నిచోట్లా ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులు నిర్వర్తించారు. కార్యాలయాల వెలుపల ఉద్యోగుల ఐక్యవేదిక జెండాలు, బ్యానర్లు ప్రదర్శించి నినాదాలు చేశారు. వెంటనే పీఆర్‌సీ ప్రకటించాలని, సీపీఎస్‌ రద్దుచేయాలని, పెండింగ్‌లో ఉన్న ఏడు డీఏలు ఇవ్వాలని, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండు చేశారు. విధులకు హాజరయ్యే ముందు జిల్లా కలెక్టరేట్ల ఎదుట ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి కాసేపు నిలుచున్నారు.

కర్నూలు కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలుపుతున్న ఉద్యోగ సంఘాల నేతలు,

ఉద్యోగులు.. పాల్గొన్న ఏపీ అమరావతి ఐకాస ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు,

ఏపీ ఐకాస సెక్రటరీ జనరల్‌ హృదయరాజు తదితరులు

విశాఖ, కాకినాడల్లో బండి... కర్నూలులో బొప్పరాజు

ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల్లో ఉద్యమస్ఫూర్తి నింపేందుకు విశాఖపట్నం, కాకినాడల్లో జరిగిన కార్యక్రమాల్లో ఏపీ ఐకాస ఛైర్మన్‌, ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, నాయకులు ఫణి పేర్రాజు, ఈశ్వరరావు, కర్నూలు కలెక్టరేట్‌ ఎదుట జరిగిన కార్యక్రమంలో ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు, నాయకులు హృదయరాజు, శివారెడ్డి, బీవీ రమణారెడ్డి పాల్గొన్నారు. ఉద్యోగులకు నల్లబ్యాడ్జీలు అందించి నిరసన కార్యక్రమాల్ని ప్రారంభించారు. 210 సంఘాలకు చెందిన దాదాపు 13 లక్షల మంది ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనల్లో పాల్గొన్నారని వారు వెల్లడించారు. మండల, తాలూకా, డివిజన్‌, జిల్లా స్థాయిల్లో నిరసనలు మొదలయ్యాయి. ఈ నెల 10వ తేదీ వరకూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇలా నల్లబ్యాడ్జీలతో విధులకు వెళ్లనున్నారు.

రవాణా శాఖ కార్యాలయం వద్ద అడ్డగింత

* ఉద్యోగుల ఐక్యవేదిక నాయకులు విద్యాసాగర్‌, వై.వి.రావు, ఇక్బాల్‌ తదితరులు ఉద్యోగులకు మద్దతుగా విజయవాడలోని ప్రాంతీయ రవాణాశాఖ కార్యాలయం (ఆర్‌టీఏ)లోకి వెళ్తుండగా.. పోలీసులు వారిని అడ్డగించారు. రవాణాశాఖ ఉద్యోగుల్ని కలిసేందుకు అనుమతించలేదు. దీంతో వారు అక్కడే బైఠాయించి నినాదాలు చేశారు. అనంతరం పోలీసులు వారిని అనుమతించారు.

* ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ ఏలూరు పంపుల చెరువు, ఆర్టీసీ డిపో వద్ద ఉద్యోగులు, కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కలెక్టరేట్‌లో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.

* గుంటూరు కలెక్టరేట్‌ వద్ద జరిగిన నిరసనలో ఐకాస ఛైర్మన్‌ శ్రీనివాసరావు, నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండు చేశారు.

* ప్రకాశం, తూర్పుగోదావరి జిల్లాల్లోని కలెక్టరేట్లలో నల్లబ్యాడ్జీలు ధరించి ఉద్యోగులు నిరసన తెలిపారు.

ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా విజయవాడలోని

నీటిపారుదల శాఖ కార్యాలయం ముందు నల్లబ్యాడ్జీలు ధరించి నినాదాలు

చేస్తున్న ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు

ఇదీ చదవండి

Employees Protest: డిమాండ్ల సాధన కోసం.. ఉద్యోగుల పోరుబాట

Last Updated : Dec 8, 2021, 6:00 AM IST

ABOUT THE AUTHOR

...view details