రాజ్‌భవన్‌లో ఉద్యోగాల పేరిట మోసం... ఘటనపై గవర్నర్ ఆగ్రహం రాజ్‌భవన్‌లో శాశ్వత ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఓ పొరుగు సేవల సంస్థ మోసగించినట్లు గవర్నర్ కార్యాలయ అధికారులకు.. కొంతమంది వ్యక్తులు ఫిర్యాదు చేశారు. అధికారులు.. ఈ విషయాన్ని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దృష్టికి తీసుకెళ్లారు. ఘటనపై స్పందించిన గవర్నర్... సమగ్ర పరిశీలన చేయాలని.. ఆయన కార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనాను ఆదేశించారు. ముఖేష్ కుమార్ మీనా నేతృత్వంలోని కమిటీ బాధితులను రాజ్‌భవన్‌కు రప్పించి విచారణ జరిపింది. మెసర్స్ సుమతి కార్పొరేట్ సర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్‌కు చెందిన కొందరు పర్యవేక్షకులు.... ప్రోటోకాల్ సిబ్బందితో కలిసి పొరుగు సేవల సిబ్బంది నియామకాల్లో అక్రమాలకు పాల్పడినట్లు వచ్చిన ఫిర్యాదుపై లోతుగా పరిశీలించారు.
గవర్నర్ ఆగ్రహం
కొత్తగా ఏర్పడిన రాజ్‌భవన్‌లో అటెండర్లు, రిసెప్షనిస్టులు, ఆఫీసు సబార్డినేట్ పోస్టుల నియామకం సదరు ఏజెన్సీ ద్వారా చేపట్టారు. పొరుగు సేవల సిబ్బంది నియామకాల్లో శాశ్వత ఉద్యోగాలు ఇప్పిస్తామని సదరు సంస్థ...మరికొందరు దళారుల ప్రమేయంతో తొమ్మిది మంది నుంచి భారీగా నగదు వసూలు చేసినట్లు కమిటీ గుర్తించింది. బాధితుల అభియోగాలను నమోదు చేసిన కమిటీ... ఆ నివేదికను గవర్నర్ హరిచందన్‌కు సమర్పించింది. శాశ్వత ఉద్యోగాలు కల్పించడం పేరిట పేదల నుంచి అనుచితంగా డబ్బులు వసూలు చేయడం చట్టవిరుద్ధమని గవర్నర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాధ్యులపై క్రిమినల్ చర్యలు
రాజ్‌భవన్ కార్యాలయం విషయంలో ఇలాంటి ఘటన జరగడంపై గవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏజెన్సీ పర్యవేక్షకులు, బాధ్యులపై తక్షణం క్రిమినల్ చర్యలు తీసుకోవాలని విజయవాడ పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావును ఆదేశించారు. ఉద్యోగాల పేరిట మోసగించిన వారిపై కేసు నమోదు చేయాలన్నారు. గవర్నర్ సూచనలతో చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడిన ఏజెన్సీపైనా చర్యలు ఉపక్రమించినట్లు రాజ్‌భవన్ కార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనా తెలిపారు.
ఇదీ చదవండి :
స.హ.చట్టం వచ్చాకే ప్రజల్లో ప్రశ్నించే తత్వం పెరిగింది: గవర్నర్