Nominated MLC's: 4 నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవులు..గవర్నర్ ఆమోదం - 4 నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవులకు ఏపీ గవర్నర్ ఆమోదం
19:04 June 14
నలుగురి పేర్లకు ఆమెదం
గవర్నర్ కోటాలో నాలుగు ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం పంపిన నలుగురి పేర్లకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సోమవారం ఆమోదముద్ర వేశారు. తోట త్రిమూర్తులు, మోసేను రాజు, లేళ్ల అప్పిరెడ్డి, రమేశ్ యాదవ్‌ల పేర్లను ప్రభుత్వం ప్రతిపాదించిన విషయం విదితమే. ఆ నలుగురిని నియమిస్తూ గెజిట్ ప్రకటన జారీ కావాల్సి ఉంది.
తోట త్రిమూర్తులు:తొలిసారి స్వతంత్ర ఎమ్మెల్యేగా రామచంద్రాపురం నుంచి ఎన్నికయ్యారు. ఆ తర్వాత తెదేపా, ప్రజారాజ్యం, కాంగ్రెస్ పార్టీల్లో చేరారు. ప్రస్తుతం మండపేట అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా పార్టీ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. అమలాపురం లోక్‌సభ నియోజకవర్గ పార్టీ బాధ్యుడిగా కూడా ఉన్నారు.
మోసేను రాజు: గతంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేశారు. ఆ తర్వాత వైకాపాలో చేరారు. 2014లో కొవ్వూరు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాల్సి ఉండగా చివరి నిమిషంలో టికెట్ దక్కలేదు. 2019 ఎన్నికల్లో రాజమహేంద్రవరం లోక్‌సభ నియోజకవర్గ వైకాపా సమన్వయకర్తగా వ్యవహరించారు. గతేడాది ఒకసారి ఎమ్మెల్యేల కోటాలో, మరోసారి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అవకాశం ఆయనకు దక్కినట్లే దక్కి చివరి నిమిషంలో చేజారింది.
లేళ్ల అప్పిరెడ్డి: కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగమైన ఎన్‌ఎస్‌యూఐ గుంటూరు జిల్లా కోశాధికారిగా 1987లో పనిచేశారు. తర్వాత 1994-2001వరకు యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా చేశారు. వివిధ కార్మిక సంఘాల నాయకుడిగా వ్యవహరించారు. గుంటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా గతంలో పనిచేశారు. 2018లో వైకాపా గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా చేశారు. ప్రస్తుతం వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, ఆ పార్టీ కేంద్ర కార్యాలయం పర్యవేక్షకుడిగా వ్యవహరిస్తున్నారు.
రమేశ్ యాదవ్: కడప జిల్లా ప్రొద్దుటూరు పురపాలక సంఘంలో ప్రస్తుతం కౌన్సిలర్‌గా ఉన్నారు. ఇదే పురపాలక సంఘం ఛైర్మన్‌గా ఎన్నికయ్యే అవకాశాన్ని చివరి నిమిషంలో కోల్పోయారు. విదేశీ విద్య సలహాదారుగా రమేశ్ ఒక సంస్థను నిర్వహిస్తున్నారు.
ఇదీచదవండి
Mansas Trust: మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్.. సంచయిత గజపతిరాజు నియామక జీవో రద్దు