కృష్ణా జలాల వివాద పరిష్కారం కోసం సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేయటం వల్ల విలువైన నీరు వృథాగా సముద్రంలోకి వెళ్లిందని పేర్కొన్నారు. వర్షాలు పడకపోతే రాయలసీమ ప్రాంతానికి అపార నష్టం జరుగుతుందన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండేందుకే సుప్రీంకోర్టుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపిన సజ్జల.. పిటిషన్ వేసే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. కృష్ణా జలాలపై రెండు రాష్ట్రాలు కలిసి మాట్లాడుకోవాలంటే.. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎవరైనా ముందుకు రావాలి కదా అని ప్రశ్నించారు. తక్కువ సమయంలో ఎక్కువ వరద జలాలను వినియోగించుకునేందుకే రాయలసీమ లిఫ్టు ఏర్పాటు చేస్తున్నామన్న సజ్జల.. ఈ అంశంపై ప్రకాశం జిల్లా తెదేపా నేతలతో లేఖలు రాయించి చంద్రబాబు ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా కృష్ణా జలాలపై తెదేపా వైఖరేంటో చంద్రబాబు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈడబ్ల్యూఎస్ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలోనే పరిష్కారిస్తుందన్నారు. ఆర్థిక శాఖకు సంబంధించి ఖర్చులను తాము ఎక్కడా దాచడం లేదన్న సజ్జల.. చంద్రబాబు చేసిన తప్పుల వల్లే ఇప్పుడు రుణ పరిమితిలో కేంద్రం కోత విధించిందని విమర్శించారు.
Water War: కృష్ణా జలాల వివాదంపై సుప్రీంకోర్టుకు వెళ్తాం: సజ్జల
కృష్ణా జలాల వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ చర్యల వల్ల నీరు వృథాగా సముద్రంలోకి వెళ్లిందని తెలిపారు. ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండేందుకే సుప్రీంకోర్టుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సజ్జల స్పష్టం చేశారు.
కృష్ణా జలాల వివాదంపై సుప్రీం కోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం
Last Updated : Jul 14, 2021, 3:27 AM IST