ప్రజలపై పెనుభారం మోపే ఆస్తి పన్ను పెంపుదల నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో సీపీఐ ఆధ్వర్యంలో ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల సామాన్యులపై పది రెట్లు అధిక భారం పడుతుందని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు అభిప్రాయపడ్డాయి. తక్షణమే జీవో నంబర్ 197, 198లను వెనక్కి తీసుకోవాలని సమావేశంలో తీర్మానం చేశారు.
సమావేశం అనంతరం సీపీఐ నగర కార్యదర్శి దోనెపూడి శంకర్ మీడియాతో మాట్లాడారు. ఆస్తి విలువ ఆధారిత పన్ను, చెత్తపై పన్ను, డ్రైనేజీపై పన్నులతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఇది ప్రజా ప్రభుత్వమా?... పన్నుల ప్రభుత్వమా? అని ఆయన నిలదీశారు. పన్నుల పెంపుపై ప్రజల్లో చైతన్యం తీసుకువస్తామని.. ప్రభుత్వం ఈ జీవోలను వెనక్కి తీసుకోకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.