పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా వైఎస్ఆర్ జగనన్న కాలనీల నిర్మాణానికి ప్రభుత్వం పాలనానుమతులు ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 28.30 లక్షల ఇళ్ల నిర్మాణానికి గృహనిర్మాణశాఖకు అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మొదటి దశలో 15.10 లక్షలు, రెండో విడతలో 13.20 లక్షల ఇళ్ల చొప్పున... రెండు దశల్లో ఇళ్లను నిర్మించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఇందుకోసం 24 వేల 776 కోట్లను ఖర్చు చేసేందుకు ప్రభుత్వం పాలనానుమతి ఇచ్చింది. ప్రభుత్వం జారీ చేసిన ఇళ్లపట్టాలతో పాటు సొంతభూమి కలిగిన వారికి, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ లబ్ధిదారులకూ ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్టు ప్రభుత్వం తెలిపింది.
నవరత్నాల్లో భాగంగా పేదలందరికి ఇళ్లు పథకం కింద చేపట్టే ఈ ఇళ్ల నిర్మాణానికి... ఇంటికి 20 మెట్రిక్ టన్నుల ఇసుక ఉచితమని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇళ్ల నిర్మాణ సంస్థను రివర్స్ టెండరింగ్ ద్వారా ఎంపిక చేయాలని ఆదేశాలిచ్చింది. మరోవైపు ఇళ్ల నిర్మాణ ఏజెన్సీ ఎంపిక కోసం రాష్ట్ర స్థాయి కమిటీలను ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్ కాలనీలకు నీటి సరఫరా కోసం.. గ్రామీణ నీటి సరఫరా, మున్సిపల్ శాఖల ద్వారా 920 కోట్లు వెచ్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది.