MEETING ON PRC: పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో అధికారుల చర్చలు ముందుకు కదలడం లేదు. అధికారులు 14.29 శాతం ఫిట్మెంట్ పైనే స్థిరంగా ఉండగా.. ఉద్యోగులు అంగీకరించడం లేదు. ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ సచివాలయంలో గురువారం ఉద్యోగ సంఘాలతో జరిపిన సమావేశం ఎలాంటి పురోగతి లేకుండానే ముగిసింది. గతంలో ఇచ్చిన ఫిట్మెంట్లు ఎక్కువగా ఉన్నాయని అధికారులు వ్యాఖ్యానించడంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే.. సీఎం జగన్ ఫిట్మెంట్ ఎంత ఇస్తారో వెల్లడిస్తే తమ అభిప్రాయం చెబుతామని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. వారం రోజుల్లో సీఎంతో ఉద్యోగ సంఘాల సమావేశం ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హామీ ఇచ్చినా నెరవేరలేదు. ఐకాసలు ఇచ్చిన 71 డిమాండ్లూ పరిష్కారానికి నోచుకోలేదు. అధికారుల సంఘాలతో సమావేశం అనంతరం సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు.
సీఎం, సీఎస్ల హామీలు అమలు కావడం లేదు: బండి శ్రీనివాసరావు
తిరుపతిలో సీఎం జగన్, అమరావతిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఇచ్చిన హామీలు నెరవేరలేదని ఏపీ ఐకాస ఛైర్మన్ బండి శ్రీనివాసరావు తెలిపారు. పీఆర్సీ ప్రకటన 72 గంటలు.. వారం రోజుల్లో ఉంటుందని చెప్పినా ఇప్పటి వరకు ఏమీ జరగలేదని పేర్కొన్నారు. ‘అధికారులు ఇచ్చిన పీఆర్సీ నివేదికను పరిగణనలోకి తీసుకోవడం లేదు. 14.29 శాతం ఫిట్‌మెంట్‌కు అంగీకరించం. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించి ఎలాంటి పురోగతి లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో సీఎం చెప్పమన్నారని అధికారులు తెలిపారు. ప్రభుత్వం 14.29 శాతం ఫిట్‌మెంట్‌పైనే మాట్లాడుతోంది. ప్రస్తుతం తీసుకుంటున్న 27 శాతం ఐఆర్‌పై ఎంత ఫిట్మెంట్ ఇస్తారో సీఎంతో చర్చించి, చర్చలకు పిలవాలని చెప్పాం. ఇక ఉపేక్షించేది లేదు. జనవరి 3న ఐకాసల స్ట్రగుల్ కమిటీ సమావేశం పెట్టుకుని భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తాం’ అని వెల్లడించారు.