రాష్ట్ర ఎన్నికల సంఘం 2021 ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదల చేసింది. మొత్తం ఓటర్ల సంఖ్య 4,01,45,674కి చేరింది. ఇందులో పురుషుల కన్నా మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. 2021 జనవరిలో ప్రచురించే తుది ఓటర్ల జాబితాకు సంసిద్ధతగా ఈ జాబితాను ఈసీ విడుదల చేసింది. జాబితాపై అభ్యంతరాలు, ఫిర్యాదులు, సవరణలు పంపించాల్సిందిగా ప్రజలను కోరింది. 2020 డిసెంబర్ 15 తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నట్టు తెలిపింది. 2021 జనవరి 15న ఓటర్ల తుది జాబితా సిద్ధం అవుతుందని ఈసీ స్పష్టం చేసింది.
ప్రస్తుతం రాష్ట్రంలో 2020 నవంబర్ 16 నాటికి సాధారణ, సర్వీసు, ఎన్నారై ఓటర్లతో కలిపి 4, 01, 45, 674 మంది ఓటర్లు ఉన్నట్లు ఈసీ పేర్కొంది. గత ఏడాదితో పోలిస్తే స్థూలంగా 1,31, 731 మేర ఓటర్ల సంఖ్య పెరిగింది. ఇందులో మహిళా ఓటర్ల సంఖ్య 2 కోట్ల 2 లక్షల 87 వేల 145 మంది కాగా.. పురుష ఓటర్ల సంఖ్య 1 కోటి 97 లక్షల 91 వేల 797 మంది ఉన్నట్లు ఈసీ తెలిపింది. ఇక సర్వీసు ఓటర్లు 66 వేలు, ఎన్నారై ఓటర్లు 7,100 మంది ఉన్నట్లు వివరించింది. వేర్వేరు కారణాల వల్ల 1,85,193 ఓట్లు తొలగించినట్టు వెల్లడించింది.