రాష్ట్ర డేటాబేస్ కేంద్రం కార్యకలాపాలు త్వరితగతిన ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ అధికారులను ఆదేశించారు. సైబర్ సెక్యూరిటీ సంబంధిత అంశాలపై ఐటీ అధికారులతో సచివాలయంలో సీఎస్ సమీక్షించారు. రాష్ట్రంలో ప్రస్తుతం వెయ్యి ఒకటి వెబ్ అప్లికేషన్లను ప్రభుత్వం నిర్వహిస్తోందని ఐటీ శాఖ అధికారులు తెలిపారు. అయితే అందులో 699 అప్లికేషన్లు మాత్రమే పనిచేస్తున్నాయని.. మిగతా 302 సాంకేతిక కారణాల వల్ల నిలిచిపోయాయని వెల్లడించారు. 330 మొబైల్ అప్లికేషన్లకు.. 19 సామాజిక మాధ్యమాల ఖాతాలు ఉన్నాయని తెలిపారు.
ప్రస్తుతం వీటికి టెక్నికల్ ఆడిట్ కూడా నిర్వహిస్తున్నట్టు సీఎస్‌కు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 25 ప్రభుత్వ శాఖలు.. ఆధార్ సంబంధిత ఆథెంటికేషన్ ద్వారా పౌరసేవల్ని అందిస్తున్నట్టు ఐటీ అధికారులు తెలిపారు. వెబ్ అప్లికేషన్లతో పాటు మొబైల్ అప్లికేషన్లు, ప్రభుత్వం నిర్వహిస్తున్న సామాజిక మాధ్యమాల ఖాతాల్లో సైబర్ భద్రత కీలకమైన అంశమన్న సీఎస్.. వీటిపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.