ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Ap corona cases : పెరుగుతున్న కరోనా కేసులు... ఆందోళనకర రీతిలో ఒమిక్రాన్ - విజయవాడ తాజా వార్తలు

Ap corona cases latest: రాష్ట్రంలో కొత్తగా 434 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 1,848 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. తాజాగా.. 102 మంది బాధితులు మహమ్మారిని జయించి కోలుకున్నారు. మరోపక్క కొత్తగా నాలుగు ఒమిక్రాన్‌ కేసులు వెలుగులోకి రాగా ఆ వేరియంట్‌ మొత్తం కేసులు 28కి చేరాయి.

Ap corona cases latest
Ap corona cases latest

By

Published : Jan 5, 2022, 6:14 PM IST

Updated : Jan 6, 2022, 4:21 AM IST

రాష్ట్రంలో కరోనా క్రమంగా తీవ్రరూపు దాలుస్తోంది. ఇప్పటికే ప్రపంచంలోని పలుదేశాల్లో పెరుగుతున్న కేసులు భయాందోళనలకు గురి చేస్తున్నాయి. మనదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో మూడో దశ మొదలైందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోనూ కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 434 మందికి వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది.

మరోపక్క కొత్తగా నాలుగు ఒమిక్రాన్‌ కేసులు వెలుగులోకి రాగా ఆ వేరియంట్‌ మొత్తం కేసులు 28కి చేరాయి. బుధవారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 1,848 క్రియాశీలక కేసులున్నాయి. పలు ఆసుపత్రుల్లో 280 మంది చికిత్సలు పొందుతున్నారు. వీరిలో కొందరు వెంటిలేటర్లపై ఉండగా మరికొందరు ఆక్సిజన్‌ వార్డుల్లో చికిత్స పొందుతుండటం గమనార్హం.

1.17% నుంచి 1.32%కు పాజిటివిటీ రేటు

రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు పెరుగుతోంది. మంగళవారం 1.17% (334 కేసులు) ఉంటే బుధవారానికి 1.32%కి చేరింది. గత ఏడాది నవంబరు తర్వాత ఈ స్థాయి పెరుగుదల ఇదే తొలిసారి. మంగళవారం ఉదయం 9 నుంచి బుధవారం ఉదయం 9 గంటల మధ్య 32,785 నమూనాల్ని పరీక్షించారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 68 కేసులొచ్చాయి. విశాఖపట్నం జిల్లాలో 63 మందికి, కృష్ణా జిల్లాలో 61 మందికి కరోనా సోకింది. 24 గంటల్లో కరోనా వల్ల ఒక్క మరణమూ లేకపోవడం కాస్త ఊరట కలిగిస్తోంది.

కొత్తగా బుధవారం మరో నాలుగు ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. గతనెల 18-27 మధ్య అమెరికా, యూకే నుంచి ప్రకాశం జిల్లాకు ముగ్గురు వచ్చారు. వీరిలో ఒకరు ఏడేళ్ల బాలుడు. వీరికి కరోనా పాజిటివ్‌ రావడంతో నమూనాలను జీనోమ్‌ స్వీకెన్సింగ్‌ కోసం పంపగా ఒమిక్రాన్‌గా తేలినట్లు వైద్య, ఆరోగ్యశాఖ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. విదేశాల నుంచి వచ్చిన కుటుంబ సభ్యులతో సన్నిహితంగా మెలిగిన గుంటూరుకు చెందిన 14 ఏళ్ల బాలికకూ ఒమిక్రాన్‌ సోకింది. వీటితో కలిపి రాష్ట్రంలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 28కి చేరింది.

40 వేల మంది రాక

గత ఏడాది నవంబరు 15 నుంచి ఇప్పటివరకు సుమారు 40వేల మంది వేర్వేరు దేశాల నుంచి రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చేరుకున్నారు. కెన్యా, దక్షిణాఫ్రికా, కువైట్, నైజీరియా, సౌదీ అరేబియా, అమెరికా, యూఏఈ, ఒమన్, సౌత్‌ సుడాన్, యూకే తదితర దేశాల నుంచి ఇక్కడికి వచ్చారు.

విజయవాడ జీజీహెచ్, విశాఖ కేజీహెచ్, తిరుపతి రుయాల్లో 15 నుంచి 20 మంది చొప్పున కొవిడ్‌ బాధితులున్నారు. తిరుపతి రుయాలో చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరు గర్భిణులున్నారని సూపరింటెండెంట్‌ భారతి తెలిపారు. ఇటీవల వరకు వారానికి ముగ్గురు నుంచి ఆరుగురు చొప్పున ఆసుపత్రిలో చేరారని, అయితే బుధవారం ఒక్కరోజే ముగ్గురు చికిత్స కోసం ఆస్పత్రిలో చేరారని వెల్లడించారు. విజయవాడ జీజీహెచ్‌లో 18 మంది కొవిడ్‌ బాధితులు చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరు వెంటిలేటర్లపై ఉన్నారు. వీరిలో కొవిడ్‌తోపాటు ఇతర అనారోగ్య సమస్యలున్న వారు ఎక్కువ. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతోన్న వారిలో అత్యధికులు దీర్ఘకాలిక వ్యాధులున్నవారేనని ఆసుపత్రుల సూపరింటెండెంట్లు తెలిపారు.

ఏ వేరియంట్‌ కేసులు?

ప్రస్తుతం రాష్ట్రంలో నమోదవుతున్న కేసులు డెల్టా వేరియంట్‌కు చెందినవా? ఒమిక్రాన్‌వా అనే దాంట్లో స్పష్టత లోపిస్తోంది. విదేశాల నుంచి వచ్చిన వారిలో కొవిడ్‌ బారినపడిన వారి నమూనాలనే జీనోమ్‌ స్వీకెన్సింగ్‌ చేయిస్తున్నారు. మిగిలిన కొవిడ్‌ బాధితుల నమూనాల్లో ర్యాండమ్‌గా ఐదుశాతం మాత్రమే ఆయాల్యాబ్‌ల ద్వారా జీనోమ్‌ స్వీకెన్సింగ్‌ కోసం పంపించాలని ఆదేశాలున్నాయి.

స్వల్ప లక్షణాలే...

మొత్తం ఒమిక్రాన్‌ బాధితుల్లో ఒకరు మినహా మిగిలిన వారంతా ఇళ్లలోనే ఉంటూ చికిత్స పొందుతున్నారు. అమెరికా నుంచి వచ్చిన ఒమిక్రాన్‌ బాధితుడు ఒకరికి స్వల్పంగా జ్వరం, దగ్గు ఉండటంతో విజయవాడ జీజీహెచ్‌లో చేరారు. ఆయనను ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నామని సూపరింటెండెంట్‌ వై.కిరణ్‌కుమార్‌ తెలిపారు. మరొక బాధితుడు విశాఖలోని కార్పొరేట్‌ ఆసుపత్రిలో ఇన్‌పేషెంట్‌గా చికిత్స పొంది, ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఒమిక్రాన్‌ బాధితుల్లో ఈ ఇద్దర్ని మినహాయిస్తే మిగిలిన వారిలో స్పల్ప లక్షణాలే కనిపించాయి.

ఇవీ చదవండి:

ఇద్దరు డిప్యూటీ సీఎంలు, ముగ్గురు మంత్రులకు కరోనా

ఆ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ.. ఆదివారం ఫుల్​ లాక్​డౌన్​

Last Updated : Jan 6, 2022, 4:21 AM IST

ABOUT THE AUTHOR

...view details