Jagananna Vidyadeevena: కుటుంబ స్థితిగతులను పూర్తిగా మార్చగలిగే శక్తి విద్యకు మాత్రమే ఉందని సీఎం జగన్ అన్నారు. ఎవరూ దొంగిలించలేని ఆస్తి పిల్లలకు ఇవ్వాలంటే.. అది కేవలం విద్యేనన్నారు. అందకే విద్యాదీవెన పథకం తనకు ఎంతో ప్రత్యేకమైందని అన్నారు ముఖ్యమంత్రి.
జగనన్న విద్యా దీవెన పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.709 కోట్లు సీఎం జమ చేశారు. కళాశాలలకు ఫీజులు చెల్లించేలా.. మూడు నెలలకోసారి విద్యా దీవెన పథకం డబ్బులు ప్రభుత్వం విడుదల చేస్తోంది. మొత్తం 10 లక్షల 82 వేల మంది విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తం ప్రభుత్వం చెల్లిస్తోంది.
జగనన్న విద్యా దీవెన పథకం డబ్బులు విడుదల ‘వసతి దీవెన కార్యక్రమంలో భాగంగా ప్రతి విద్యార్థికీ ఇచ్చే రూ.20వేలలో ఇప్పటికే రూ.10వేలు ఇచ్చాం. రెండో విడత మొత్తాన్ని ఏప్రిల్ 5న ఇస్తాం. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే నేరుగా ప్రజల్లోకి వెళ్లి.. తల్లుల ఖాతాల్లోకి నిధుల్ని జమ చేస్తాం’ - సీఎం జగన్
పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయి
ఏపీలో ప్రైవేట్ బడుల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు పెరిగాయని సీఎం జగన్ అన్నారు. నాడు- నేడుతో పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నట్లు చెప్పారు. ‘జగనన్న విద్యాదీవెన’ పథకం డబ్బులను తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి జగన్.. తల్లుల ఖాతాల్లో జమచేశారు. అనంతరం మాట్లాడుతూ.. చదువుతో జీవన స్థితిగతుల్లో మార్పు వస్తుందని చెప్పారు. చదువులకు పేదరికం అడ్డు కాకూడదని జగన్ అన్నారు. చదువుల కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదని చెప్పారు. విద్య మాత్రమే పేదరికాన్ని దూరం చేస్తుందని తెలిపారు. అర్హులైన అందరికీ పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ చేస్తున్నట్లు సీఎం వివరించారు. గత ప్రభుత్వంలోని బకాయిలు రూ.1,778 కోట్లు కూడా చెల్లిస్తున్నట్లు జగన్ చెప్పారు.విద్యార్థుల భవిష్యత్తుపై తనలా ఆలోచించే ముఖ్యమంత్రి ఎవరూ ఉండరని పేర్కొన్నారు. అమ్మఒడి, గోరుముద్ద, విద్యా కానుక పేరుతో ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఉన్నత విద్య సిలబస్‌లో పెద్ద ఎత్తున మార్పులు చేస్తున్నామని ఆయన వివరించారు.
పాదయాత్రలో జరిగిన ఘటనే కనిపిస్తోంది
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై మాట్లాడాలంటే.. పాదయాత్ర సమయంలో నెల్లూరు జిల్లాలో జరిగిన ఘటన తనకు కనిపిస్తోందని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. ‘కళాశాలలో ఫీజు రూ.లక్ష ఉంటే రీయింబర్స్‌మెంట్ ద్వారా రూ.30వేలే వచ్చింది. మిగిలిన రూ.70వేల భారాన్ని తండ్రిపై మోపలేక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని విద్యార్థి తండ్రి చెప్పారు. ఈ పరిస్థితి రాష్ట్రంలో ఏ ఒక్కరికీ రాకూడదు’ అని సీఎం పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.1,778 కోట్లుంటే.. తామే చెల్లించామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థినులు, వారి తల్లులు సీఎంతో మాట్లాడారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపే విశ్వరూప్, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ సమీర్ శర్మ, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి, పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ సీఈఓ ఆలూరు సాంబశివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:
APSDC: మద్యంపై ప్రత్యేక మార్జిన్ వసూలు.. ఖజానాకు పంపకుండా కొత్త ఎత్తుగడ