AP Budget Session:మార్చి మొదటి వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించే అవకాశం ఉంది. మార్చి 4 లేదా 7 నుంచి ఈ సమావేశాలను ప్రారంభించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. కరోనా తీవ్రత తగ్గితే కనీసం 20 నుంచి 25 రోజుల పాటు, పరిస్థితులు అనుకూలంగా లేకపోతే 10 నుంచి 12 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలనే యోచనలో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఉద్యోగుల పదవీవిరమణ వయసు 60నుంచి 62కి పెంచడం, కొత్త జిల్లాల ఏర్పాటు, ఓటీఎస్ వంటిఅంశాలను సమావేశాల్లో చర్చించే అవకాశం ఉందని పేర్కొన్నాయి.
ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో శుక్రవారం జరిగిన సమావేశంలో వచ్చే ఏడాది వార్షిక బడ్జెట్ రూపకల్పనపై అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. వివిధ శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలనూ ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఏయే రంగాలకు ఈ సారి బడ్జెట్ ఎలా ఉండాలనే విషయమై సీఎం అధికారులకు సూచనలు చేసినట్లు సమాచారం.