BJP Prajagraha Sabha News: భాజపా ప్రజాగ్రహ సభలో అధికార వైకాపా ప్రభుత్వంపై భారతీయ జనతాపార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. విజయవాడలోని సిద్ధార్థ కళాశాల ప్రాంగణంలో ప్రారంభమైన సభలో సీఎం జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. ప్రజలకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
Somu veerraju in Prajagraha Sabha: భాజపా అధికారంలోకి వస్తేనే రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి జరుగుతుందని రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. మా సభను చూసి చాలామంది ఇబ్బంది భయపడుతున్నారని సోము వీర్రాజు పేర్కొన్నారు. జగన్‌కు ఏం చూపించాలో అది చూపించే పార్టీ మాదే అన్నారు. తెదేపా, వైకాపా ప్రభుత్వాలు.. రాష్ట్రాన్ని అభివృద్ధికి దూరం చేశాయని దుయ్యబట్టారు. ఆస్తులు పోగేసుకునేందుకు ఈ నేతల తాపత్రయం పడ్డారే తప్ప రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు. ఏపీలోని అనేక హైవేలను కేంద్రం అభివృద్ధి చేస్తోందన్న సోము.. కేంద్ర పథకాలకు రాష్ట్ర స్టిక్కర్లు అంటిస్తున్నారని పేర్కొన్నారు. ఉపాధిహామీ నిధులతో జగనన్న రైతుభరోసా కేంద్రాలా అని ప్రశ్నించారు.
ప్రత్యేక హోదా ఎందుకు వద్దన్నారని ముందు చంద్రబాబును అడగాలి. ప్రత్యేక హోదా పరిధి నీతి ఆయోగ్‌లో ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ఇప్పటికీ కాపాడుతున్న పార్టీ మాదే. యూనియన్లతో పాఠశాలలను సర్వనాశనం చేసింది కమ్యూనిస్టులే. ట్రేడింగ్ పార్టీలకు ఏజెంట్లు.. కమ్యూనిస్టు పార్టీలు. మా పార్టీ.. హంగులకు, ఆర్భాటాలకు దూరం. భాజపా అధికారంలోకి వస్తేనే ఏపీ సర్వతోముఖాభివృద్ధి. - సోము వీర్రాజు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
జగన్ పాలనతో ఏపీ పాతికేళ్లు వెనక్కి: ఎంపీ సుజనా చౌదరి
MP Sujana chowdary on ysrcp: ముఖ్యమంత్రి జగన్.. వన్‌టైమ్ వండర్‌గా మిగిలిపోతారని ఎంపీ సుజనా చౌదరి అన్నారు. జగన్.. ప్రజలకు పప్పు బెల్లాలు పంచుతున్నారన్న సుజనా.. కుడిచేతితో ఇచ్చి ఎడమచేతిలో లాక్కుంటున్నారని విమర్శించారు. వైకాపా ఎంపీలకు కేసుల పైరవీలతోనే సరిపోతోందన్న సుజనా.. రాష్ట్రం కోసం కేంద్రాన్ని ఏమీ అడగడం లేదన్నారు. 'మద్యనిషేధం పేరుతో 150 శాతం రేట్లు పెంచారు. పెట్రో ధరలు అన్ని రాష్ట్రాల కంటే ఏపీలోనే ఎక్కువగా ఉన్నాయి. సీఎం జగన్.. సినిమా రంగాన్ని ఇబ్బంది పెడుతున్నారు. జగన్ పాలనతో ఏపీ పాతికేళ్లు వెనక్కి పోయింది. అప్పుల కోసం కేంద్రం చుట్టూ తిరుగుతున్నారు. వైకాపా నేతలు.. విశాఖలో భూదందాలకు పాల్పడుతున్నారు. రాజధాని విషయంలో మాటమార్చిన జగన్..అమరావతి నుంచి రాజధానిని అంగుళం కూడా కదల్చలేరు' అని సుజనా చౌదరి అన్నారు.
జగన్ హయాంలో రాష్ట్రం సర్వనాశం: కన్నా లక్ష్మీనారాయణ
జగన్ పాలనలో రాష్ట్రం సర్వనాశనమైందని భాజపా నేత కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. మోదీ 110 రత్నాలు ఇస్తుంటే.. జగన్ నవరత్నాలే ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. నవరత్నాల పేరుతో జగన్ నిలువు దోపిడీకి పాల్పడుతున్నారని పేర్కొన్నారు. వైకాపా హయాంలో వ్యవస్థలు, సంస్థలు, వ్యక్తులు తమ మనుగడ కోల్పోయాయి. తనపాలనపై తనకు నమ్మకం లేని జగన్.. పీకేని ఎక్కువ నమ్ముతున్నారని కన్నా విమర్శించారు.