విజయవాడలో భాజపా 'ప్రజాగ్రహ సభ' విజయవాడలో భాజపా ప్రజాగ్రహ సభ ప్రారంభమైంది. సిద్ధార్థ హోటల్ మేనేజ్‌మెంట్ కళాశాల మైదానంలో సభ నిర్వహణకు భాజపా అన్ని ఏర్పాట్లు చేసింది. గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న మాజీ కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్, ఎంపీలు సీఎం రమేశ్, కేంద్ర భాజపా నాయకులు సత్య కుమార్, తదితరులకు.. రాష్ట్ర భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఎంపీ సుజనా చౌదరి సభా ప్రాంగణానికి చేరుకున్నారు.
ప్రజాగ్రహ సభ అనేది ఆరంభం మాత్రమే: ఎంపీ సుజనా
కేశవ్, పేర్ని నాని వ్యాఖ్యలపై ప్రజాగ్రహ సభలో మాట్లాడతామని ఎంపీ సుజనా చౌదరి అన్నారు. ప్రజాగ్రహ సభ అనేది ఆరంభం మాత్రమే అన్నారు. పోలీసులు వైకాపా కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని.. అమరావతి రాజధానిని ఒక్క అంగుళం కూడా కదిలించలేరని వ్యాఖ్యానించారు.
వైకాపా, తెదేపా గుండెల్లో భయం పట్టుకుంది: సీఎం రమేశ్
ప్రజాగ్రహ సభ అంటే వైకాపా, తెదేపా గుండెల్లో భయం పట్టుకుందని భాజాపా ఎంపీ సీఎం రమేశ్ అన్నారు. మంత్రి పేర్ని నాని, పయ్యావుల కేశవ్‌ల వ్యాఖ్యలు ఆ భయం నుంచి వచ్చినవేనని ఆయన తెలిపారు. వైకాపాలో ఏం జరుగుతుందో పేర్ని నాని ఆలోచించుకోవాలని సూచించారు. వైకాపాలో అంతర్గత పోరు ఉందని.. తెదేపా ప్రతిపక్షంగా విఫలమైందన్నారు. వైకాపా చేసిన తప్పులను ప్రజలకు సభలో వివరిస్తారన్నారు. 'అధికారులు.. పోలీసుల తీరుపై టెలిస్కోప్ అంటూ తాను వ్యాఖ్యలు చేశాక చాలా మంది ఏపీ అధికారులు నాకు ఫోన్ చేశారు.. తాము ఇక్కడ పని చేయలేకపోతున్నామని, కేంద్రం జోక్యం చేసుకుంటేనే మంచిదని చెబుతున్నారు' అని సీఎం రమేశ్ వ్యాఖ్యానించారు.
2024లో విజయానికి నాందిగా ఈ బహిరంగ సభ
వైకాపా పాలనను 10 అంశాల ద్వారా ఎండగట్టేలా నేతల ప్రసంగాలు ఉంటాయని భాజపా వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఆస్తుల అమ్మకం, తనఖా, అప్పులు, ఆర్థిక సంక్షోభం, ఉద్యోగుల అవస్థలు, గుత్తేదారులకు బిల్లుల చెల్లింపుల్లో జాప్యం, విద్యుత్తు బిల్లుల మోత, కేంద్ర నిధుల వినియోగం, కేంద్ర పథకాలను రాష్ట్ర పథకాలుగా ప్రచారం, ధరల నియంత్రణలో ప్రభుత్వ వైఫల్యంపై పార్టీ నేతలు ప్రసంగించనున్నారు. 2024లో జరిగే ఎన్నికలలో విజయం సాధించేందుకు నాంది పలికేలా బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు.
ఇదీ చదవండి...
Pedapolamamba Jathara: శంబరకు చేరిన పెదపోలమాంబ.. మొదలైన జాతర