రాష్ట్ర భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు(Somu veeraju) నేతృత్వంలోని రాష్ట్ర భాజపా నేతలు కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను కలిశారు. ఈ సందర్భంగా పోలవరం నిర్వాసితులు, ముంపు గ్రామాల సమస్యను కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీకి సంబంధించి ముంపు గ్రామాల ప్రజలకు ఇప్పటి వరకు సాయం అందలేదని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రాజెక్టుల పరిస్థితిని వివరించారు. రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో చొరవచూపి ఆ ప్రాంతానికి న్యాయం చేయాలని భాజపా నేతలు కేంద్ర మంత్రిని కోరారు.
కేంద్ర మంత్రితో భేటీ అనంతరం సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు. ఇటీవల విజయవాడలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో సాగునీటిరంగ నిపుణులు ఇచ్చిన సలహాలు, సూచనలు కేంద్ర మంత్రికి వివరించినట్టు చెప్పారు. రాష్ట్ర పర్యటనకు రావాలని కేంద్ర మంత్రి షెకావత్‌ను కోరగా.. ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఎంపీలు సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్, జీవీఎల్ నరసింహారావు, సీనియర్ నేతలు కన్నా లక్ష్మీనారాయణ, విష్ణువర్దన్‌రెడ్డి, మాధవ్, భానుప్రకాశ్‌రెడ్డి తదితరులు సోము వీర్రాజుతో పాటు కేంద్ర మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. అనంతరం కేంద్ర ఉక్కు శాఖ మంత్రి రామచంద్రప్రసాద్‌సింగ్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు.