ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అమర్‌నాథ్‌ యాత్ర.. 84 మంది ఏపీ వాసులు సురక్షితం

AMARANATH: అమర్‌నాథ్ యాత్రకు వెళ్లిన ఏపీకి చెందిన 84 మంది యాత్రికులు సురక్షితంగా ఉన్నారని.. మరో ఇద్దరి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. యాత్రికులు, వారి కుటుంబీకుల కోసం దిల్లీలోని ఏపీ భవన్‌లో హెల్ప్‌లైన్‌ నంబర్‌ను ఏర్పాటు చేయడంతోపాటు ఉన్నతాధికారులను శ్రీనగర్‌కు పంపించినట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది.

అమర్‌నాథ్‌ విషాదం
అమర్‌నాథ్‌ విషాదం

By

Published : Jul 10, 2022, 10:13 AM IST

Updated : Jul 10, 2022, 3:09 PM IST

AMARANATH:అమర్‌నాథ్‌లో చోటుచేసుకున్న విషాదంలో ఆచూకీ లభించని వారికోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే దాదాపు 15వేల మంది యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాగా విరిగిపడిన కొండచరియల్లో దాదాపు 40 మంది వరకూ ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 84 మంది యాత్రికులు సురక్షితంగా ఉన్నారని.. మరో ఇద్దరి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. యాత్రికులు, వారి కుటుంబీకుల కోసం దిల్లీలోని ఏపీ భవన్‌లో హెల్ప్‌లైన్‌ నంబర్‌ను ఏర్పాటు చేయడంతోపాటు ఉన్నతాధికారులను శ్రీనగర్‌కు పంపించినట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది.

అమర్‌నాథ్‌ క్షేత్రం సమీపంలో ఆకస్మికంగా సంభవించిన వరద విపత్తులో ఇప్పటివరకు 16 మంది మృతిచెందారు. వంద మందికిపైగా గాయపడగా వారికి వివిధ ప్రాంతాల్లో చికిత్సలు అందిస్తున్నారు. మరో 40మంది కోసం సైన్యం, కేంద్ర బలగాలు, పోలీసులు నిర్విరామంగా సహాయక చర్యలు చేపట్టాయి. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురి ఆచూకీ లభించకపోవడంతో ఆందోళన నెలకొంది. దీంతో జమ్మూ అధికారులతో సమన్వయం చేసుకునేందుకు ఏపీ భవన్‌ అడిషనల్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ హిమాన్షు కౌశిక్‌ను శ్రీనగర్‌కు పంపించినట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రం నుంచి అమర్‌నాథ్‌ వెళ్లిన యాత్రికులకు సహాయం అందించేందుకు 1902 హెల్ప్‌లైన్‌ నంబర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది.

ఒక్కసారిగా కురిసిన అతిభారీ వర్షానికి శుక్రవారం అమర్‌నాథ్‌ సమీపంలోని బేస్‌ క్యాంపులోని గుడారాలపైకి వరద పోటెత్తిన సంగతి తెలిసిందే. కొండచరియలు విరిగిపడటంతో పాటు పెద్దఎత్తున బురద, రాళ్లు కొట్టుకు రావడంతో అక్కడ ఒక్కసారిగా బీభత్స పరిస్థితులు నెలకొన్నాయి. శిథిలాల కింద పదుల సంఖ్యలో యాత్రికులు ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విస్తృతంగా గాలింపు చేపట్టిన ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఆర్మీ, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ బలగాలతోపాటు స్థానిక పోలీసులు.. రెస్క్యూ ఆపరేషన్‌ను కొనసాగిస్తూనే ఉన్నారు. శనివారం నాటికి 16 మృతదేహాలను వెలికితీశారు. కాగా ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఆదివారం కూడా యాత్రను నిలిపివేసిన అధికారులు.. పహల్గామ్‌, బల్తాల్‌ మార్గాల నుంచి వచ్చే కాన్వాయ్‌లను ఎక్కడికక్కడే ఆపివేశారు. దీంతో వేల మంది యాత్రికులు అమర్‌నాథ్‌ యాత్ర పునరుద్ధరణ కోసం వేచిచూస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Jul 10, 2022, 3:09 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details