రాష్ట్ర శాసనసభ ఒకరోజు సమావేశం కానుంది. ఉదయం 8:30 గంటలకు శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ, 9:30 గంటలకు శాసనమండలి వ్యవహారాల సలహా కమిటీ సమావేశాలు నిర్వహించి ఉభయ సభల్లో చర్చించాల్సిన, పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారు.
గురువారం సమావేశంలో మహిళా సాధికారతపై స్పల్పకాలిక చర్చ చేపట్టే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఈ ఏడాది మే 20న ఒకరోజు అసెంబ్లీ సమావేశమైంది. అది జరిగి శుక్రవారానికి ఆరు నెలలు అవుతుంది. ఆరు నెలలు ముగిసేలోపు అసెంబ్లీని మళ్లీ సమావేశపరచాల్సి ఉంటుంది. అందుకే గురువారం ఒకరోజు సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నెలాఖరులో లేదా వచ్చే నెలలో వారం/పది రోజులపాటు పూర్తిస్థాయి సమావేశాలను నిర్వహించనున్నారు.
ప్రస్తుతం ఎనిమిది జిల్లాల పరిధిలోని 11 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇవన్నీ ఏకగ్రీవమైతే మాత్రం అసెంబ్లీ సమావేశాలు ఈ నెలాఖరులోనే మళ్లీ జరగొచ్చు. ఒకవేళ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలింగ్ జరిగే పరిస్థితి వస్తే డిసెంబరు మూడోవారంలో సమావేశాలను నిర్వహించవచ్చని ప్రభుత్వ వర్గాల నుంచి అందిన సమాచారం.
అయితే... ఈ ఏడాది జులై 27 నుంచి నవంబరు 9వ తేదీ మధ్య రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మొత్తం 14 ఆర్డినెన్సులకు సంబంధించిన బిల్లులను సమావేశల్లో ప్రవేశపెట్టే అవకాశముంది. రాష్ట్రంలోని ఎయిడెడ్ విద్యాసంస్థలకు ప్రభుత్వ గ్రాంటు నిలిపివేత, వ్యవసాయ భూములకు "ల్యాండ్ పార్సిల్ నంబరు" ఇచ్చేలా వీలు కల్పించే చట్ట సవరణలతోపాటు మద్యం విక్రయిస్తూ వ్యాపార నిర్వహణే ప్రధాన విధిగా ఉన్న ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్‌బీసీఎల్)కు సంక్షేమ పథకాలు అప్పగించే కీలక చట్ట సవరణల ఆర్డినెన్సులూ జాబితాలో ఉన్నాయి. సినిమా టికెట్లకు సంబంధించిన, భూములు, పట్టాదారు పాసుపుస్తకాలకు సంబంధించిన, మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన ఆర్డినెన్సుల బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
రెవెన్యూ
ఆంధ్రప్రదేశ్ భూములు, పట్టాదారు పాసుపుస్తకాలపై హక్కులు (సవరణ) ఆర్డినెన్సు: వ్యవసాయ భూములకు ప్రస్తుతం ఉన్న సర్వే నంబరు, సబ్ డివిజన్ నంబరు స్థానంలో 'ల్యాండ్ పార్సిల్' నంబరు ఇచ్చేందుకు వీలు.
ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ భూముల బదలాయింపు నిషేధం (సవరణ) ఆర్డినెన్సు: అసైన్డ్ ఇళ్ల స్థలాల విక్రయానికి ప్రస్తుతం ఉన్న 20 ఏళ్ల గడువు పదేళ్లకు తగ్గింపు.
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ భూమి (వ్యవసాయేతర అవసరాలకు మార్పిడి) (సవరణ) ఆర్డినెన్సు: నాన్-అగ్రికల్చరల్ ల్యాండ్ అసెస్మెంట్ (నాలా) కింద జరిగే భూ వినియోగ మార్పిడిలో వివాదాలు వస్తే భూ పరిపాలనా ప్రధాన కమిషనర్‌కు బదులుగా జిల్లా అధికారులకు అప్పీల్ చేసుకునేందుకు వీలు. భూ వినియోగ మార్పిడి ఫీజును గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా కూడా చెల్లించేందుకు అవకాశం.
పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలు
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్స్ (సవరణ) ఆర్డినెన్సు: నగరపాలక సంస్థల్లో రెండో డిప్యూటీ మేయర్, పురపాలక సంఘాల్లో రెండో వైస్ ఛైర్మన్ ఎన్నికకు అవకాశం.