Anganwadi Sabha: కార్మికులతో వివిధ పనులు చేయిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రమదోపిడీ చేస్తున్నాయని ప్రగతిశీల అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ (ఇఫ్టూ) జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ అపర్ణ అన్నారు. ఏపీ ప్రగతిశీల అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ (ఇఫ్టూ) ఆవిర్భావ సభ విజయవాడ సిద్దార్థ ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన డాక్టర్ అపర్ణ మాట్లాడుతూ పెరుగుతున్న ఖర్చులతో అంగన్‌వాడీ సిబ్బంది తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ విషయాన్ని పలుసార్లు ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లినా మార్పు రావడంలేదని ఆరోపించారు. వేతనాలు పెంచకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. అంగన్‌వాడీ సిబ్బంది విజయవాడ సభకు వస్తుంటే వాహనాలను పోలీసులు ఆపడంపై మండిపడ్డారు.
అంగన్వాడీ ఆవిర్భావ సభలో మాట్లాడుతున్న ఇఫ్టూ జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ అపర్ణ ఇఫ్టూ రాష్ట్ర అధ్యక్షుడు పి.ప్రసాద్, కోశాధికారి వి.శిరోమణి, ప్రధాన కార్యదర్శి కె.పోలారి, ఉపాధ్యక్షుడు ఎం.వెంకటేశ్వర్లు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు టి.శ్రీనివాస్, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.రవిచంద్ర తదితరులు ప్రసంగించారు. తొలుత భారీ ర్యాలీ నిర్వహించారు. అడ్డంకులు సృష్టించినా, రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి తరలివచ్చి సభను విజయవంతం చేశారని నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
నూతన కార్యవర్గం ఎన్నిక:ఈ సందర్భంగా ఏపీ ప్రగతిశీల అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్ర గౌరవాధ్యక్షులుగా ఆర్.హరికృష్ణ, న్యాయ సలహాదారుగా ఎం.లక్ష్మి, రాష్ట్ర అధ్యక్షురాలుగా జె.గంగావతి, ప్రధాన కార్యదర్శిగా వీఆర్ జ్యోతి, ఉపాధ్యక్షురాలిగా జి.భారతిరాణి, సహాయ కార్యదర్శులుగా గంగాదేవి, కృష్ణవేణి, కోశాధికారిగా శిరోమణి, 14 మంది కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ప్రతిఘటించిన మహిళలు:తిరుపతి జిల్లా అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల యూనియన్‌కి చెందిన మహిళలు 150 మంది తమ సమస్యలపై ఆదివారం విజయవాడలో ఏపీ ప్రగతిశీల అంగన్‌వాడీ వర్కర్ల ఆవిర్భావ మహాసభలో చర్చించుకోవడానికి బస్సుల్లో బయల్దేరారు. మార్గమధ్యలో పెళ్లకూరు మండలం చావలి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అయినా ప్రతిఘటించి ముందుకెళ్లారు. రాత్రయినా రోడ్డు మీదే వేచి ఉన్నారు. ఉదయం 9గంటల సమయంలో విజయవాడ బయల్దేరారు. పూచీకత్తు లేఖలు ఇవ్వాలని పోలీసులు కోరినా రాజీలేని పోరాటం చేశారు. ‘ప్రభుత్వం మా యూనియన్ పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోంది.. సమావేశానికి అనుమతి ఇచ్చి అడ్డుకోవడం ఏమిటి’ అని ప్రగతిశీల అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్ తిరుపతి జిల్లా కోశాధికారి గంగాభవాని ప్రశ్నించారు. ఆదివారం ఇక్కడ విలేకర్లతో మాట్లాడుతూ పోలీసులు ప్రభుత్వానికి తొత్తులుగా మారారని ఆరోపించారు. ప్రభుత్వానికి బుద్దిచెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. యూనియన్ నాయకులు భారతి, సుభాషిణి తదితరులు పాల్గొన్నారు. సీఐ సోమయ్య వీరికి ఉదయం అల్పాహారం అందించి విజయవాడకు వెళ్లడానికి అనుమతి ఇచ్చారు.
ఇదీ చదవండి: తప్పు చేశానని నిరూపిస్తే.. ప్రాణం తీసుకుంటా: మంత్రి గుడివాడ అమర్‌నాథ్