కరోనా మహమ్మారి వల్ల ఒడిదొడుకులకు గురైన విద్యావ్యవస్థలో ఇన్నాళ్లకు పరిస్థితులు సాధారణస్థితికి వచ్చి.. వార్షిక పరీక్షల స్థాయికి చేరుకున్నాయి. తెలంగాణలో రెండేళ్ల తర్వాత పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉండడంతో విద్యార్థుల్లో తీవ్ర భయాందోళనలు, మానసిక ఒత్తిడి ఎక్కువవుతున్నాయని మనస్తత్వ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇంటర్ పరీక్షలు మే 6 నుంచి, పదో తరగతి పరీక్షలు మే 23 నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షలు సమీపిస్తున్నకొద్దీ ఆందోళనతో తమ వద్దకు వచ్చే పిల్లలు, తల్లిదండ్రులు ఎక్కువగా ఉంటున్నారని నిపుణులు చెబుతున్నారు.
కరోనా వల్ల రెండేళ్లుగా పాఠశాలలు సరిగా నడవక విద్యార్థులు చదువుకు దూరమయ్యారు. ఆన్‌లైన్ పాఠాలు చాలా తక్కువ మందికే చేరాయి. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఎనిమిదో తరగతి ముగింపు దశలో ఉండగా.. కొవిడ్ వ్యాపించడంతో పరీక్షలు జరగలేదు. తరువాత సంవత్సరం కూడా అదే పరిస్థితి రావడంతో తొమ్మిదో తరగతి కూడా ఆన్‌లైన్‌లోనే గడచిపోయింది. పదో తరగతిలో 70 శాతం సిలబస్‌కే పరిమితం చేసినా.. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి వల్ల తరగతులు అరకొరగానే సాగాయి. ఆ విద్యార్థులు రెండేళ్ల తర్వాత ఇప్పుడు వార్షిక పరీక్షలు రాయబోతున్నారు. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులదీ అదే పరిస్థితి. కొన్ని సూచనలు పాటిస్తే భయాలను అధిగమించి పరీక్షల్లో గట్టెక్కవచ్చని మనస్తత్వ నిపుణులు చెబుతున్నారు.
తల్లిదండ్రుల బాధ్యత ఇదీ..
* పిల్లల సామర్థ్యాలకు తగ్గట్టుగానే ప్రోత్సహించాలి. అతి అంచనాలు వేయకూడదు. దీనివల్ల పిల్లల్లో ఒత్తిడి మరింత అధికమవుతుంది.
* ఫలితాలు ఎలా ఉన్నా, ‘ఫరవాలేదు.. మేమున్నా’మంటూ తరచూ ధైర్యం చెప్పాలి.
* పిల్లలకు సమతులాహారం, సరిపడా తాగునీరు ఇవ్వడం, విశ్రాంతి కల్పించడం, స్వల్ప వ్యాయామం చేయించడం, మలబద్ధకం రాకుండా పీచుపదార్థాలు తినిపించడం చేయాలి.
పిల్లల్లో సమస్యలు ఇవీ...
* 2-3 గంటలసేపు ఒకేచోట స్థిమితంగా కూర్చోలేకపోతున్నారు.
* రాసే అలవాటు తప్పిపోయింది.
* ఒక విషయంపై ఏకాగ్రత పెట్టలేకపోతున్నారు. తరచూ ధ్యాస మళ్లిపోతోంది.