తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ... వరుస దాడులతో అవినీతి పరులకు దడ పుట్టిస్తోంది. ఉన్నతాధికారులైనా సరే... వారి అక్రమాల గురించి సమాచారం అందితే చాలు ప్రత్యేక కార్యాచరణతో ఆధారాలన్నీ అనిశా అధికారులు సేకరిస్తున్నారు. ఆ తర్వాత రంగంలోకి దిగి అవినీతి పరుల అక్రమాలను బయటపెడుతున్నారు.
కోట్లకు కోట్లే మింగేస్తున్న తిమింగలాలు...
ఇటీవల కాలంలో మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేశ్, కీసర తహసీల్దార్ నాగరాజు కేసుల్లో ఏసీబీ పకడ్బందీగా వ్యవహరించి అన్ని ఆధారాలను సేకరించి... ఇద్దరు లంచగొండి అధికారుల తీరును బయటపెట్టింది. ఈ ఇద్దరు అధికారులు తీసుకున్న లంచం మొత్తం చూసి అనిశా అధికారులే విస్తుపోయారు. మెదక్ జిల్లా సర్వాపూర్ మండలం చిప్పలతుర్తి గ్రామంలో 112 ఎకరాల భూమికి నిరభ్యంతర పత్రం ఇచ్చేందుకు అనదపు కలెక్టర్ నగేశ్... ఎకారానికి లక్ష రూపాయలు చొప్పున మొత్తం రూ.1.12 కోట్ల లంచం డిమాండ్ చేశాడు. డిమాండ్ చేసిన మొత్తంలో 40 లక్షలు తీసుకున్నాడు. బాధితుడి దగ్గర నుంచి ఐదెకరాల స్థలం రాయించుకున్నాడు.
పక్కా ఆధారాలతో...
ఇంత చేసి తనకు డబ్బు, స్థలం ఇచ్చిన వ్యక్తి ఎవరో తెలియదంటూ బుకాయించాడు. అనిశా అధికారులు ఎన్నిసార్లు ప్రశ్నించినప్పటికీ... ఇదే సమాధానం చెప్పాడు. చెక్కులు, స్థలం పత్రాలు జిల్లా మాజీ కలెక్టర్ ధర్మారెడ్డి వద్ద ఉండవచ్చేమోనన్నాడు. సోదాల నేపథ్యంలో తన నివాసంలోనే చెక్కులు, దస్త్రాలు ఏసీబీ విచారణ బృందం స్వాధీనం చేసుకోగా నగేశ్ కంగుతిన్నాడు. ఈ తతంగంలో భాగస్వామ్యులైన సర్వేయర్ వసీం, ఆర్డీవో అరుణారెడ్డి, తహసీల్దార్ సత్తార్, బినామీ జీవన్‌గౌడ్‌ను పక్కా ఆధారాలతో ఏసీబీ అరెస్టు చేసింది.
ఫిర్యాదు ఉంటేనే కాదు.. అనుమానమొచ్చినా...
మరో కేసులో భూవివాదానికి సంబంధించి అనుకూల దస్త్రాలు ఇచ్చేందుకు కీసర తహసీల్దార్ నాగరాజు ఏకంగా 1.10 కోటి తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఈ కేసులో ఫిర్యాదుదారులెవరూ లేనప్పటికీ... పకడ్భందీగా వ్యవహరించిన ఏసీబీ నాగరాజుకు లంచం ఇచ్చిన స్థిరాస్తి వ్యాపారులు అంజిరెడ్డి, శ్రీనాథ్‌తో పాటు వీఆర్‌ఏ సాయిరాజ్‌ను అరెస్టు చేశారు.