ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రూ. 10 వేలు పెట్టి... రూ.లక్షల్లో కాజేసి... - విజయవాడ ఏటీఎం కేసు వార్తలు

గత నెలలో విజయవాడలోని ఎస్‌బీఐ ఏటీఎం కేంద్రాల్లో నగదు కాజేస్తున్నారని నమోదైన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. హరియాణాలోని మేవత్‌ ప్రాంతానికి చెందిన 13 మంది సభ్యుల ముఠాలో ఇప్పటి వరకు ఆరుగురిని అరెస్టు చేశారు. ఏటీఎం కేంద్రాల్లోని సీసీ కెమెరాల చిత్రాలను, ఇతర ప్రాంతాల్లో నమోదైన కేసుల ఆధారంగా నిందితులను గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు.

atm theft case in vijayawada
atm theft case in vijayawada

By

Published : Sep 14, 2020, 7:28 AM IST

Updated : Sep 14, 2020, 5:36 PM IST

atm theft case in vijayawada

రూ.10వేల పెట్టుబడి పెట్టి.. రూ.లక్షల్లో నగదు కాజేసే ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. హరియాణాలోని మేవత్‌ ప్రాంతానికి చెందిన 13 మంది సభ్యుల ముఠాలో ఇప్పటి వరకు ఆరుగురిని అరెస్టు చేశారు. మిగతా వారి కోసం ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. గత నెలలో విజయవాడలోని ఎస్‌బీఐ ఏటీఎం కేంద్రాల్లో నగదు కాజేస్తున్నారని సత్యనారాయణపురం పోలీస్‌స్టేషన్‌లో నమోదైంది. దీన్ని వారు సీసీఎస్‌ పోలీసులకు అప్పగించారు. ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నేర పరిశోధన విభాగం పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఏటీఎం కేంద్రాల్లో నమోదైన సీసీ కెమెరాల చిత్రాలను, ఇతర ప్రాంతాల్లో నమోదైన కేసులను పరిశీలించిన పోలీసులు హరియాణాలోని మేవత్‌ముఠాకు చెందినవారిగా గుర్తించారు.

దీంతో ఓ బృందాన్ని హరియాణాకు పంపిన పోలీసులు.. నగరంలోని ఏటీఎంలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. అరెస్టయిన వారిలో మేవత్‌ జిల్లాలోని ముందెత ప్రాంతానికి చెందిన హరిష్‌ఖాన్‌, అబ్దుల్లాఖాన్‌, నసీమ్‌అహ్మద్‌, ఫరూఖ్‌, నియాజ్‌ మహమ్మద్‌, వాహీద్‌ఖాన్‌లు ఉన్నారు. వీరిలో మొదటి నలుగురిని విజయవాడలో అరెస్టు చేయగా.. మిగతా ఇద్దరిని హరియాణాలో అదుపులోకి తీసుకున్నారు. వీరిని రెండు రోజుల క్రితం కోర్టులో ప్రవేశపెట్టగా రిమాండ్‌ విధించారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు, నగదు రికవరీ చేసేందుకు వారిని సోమవారం పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు.

రూ.పదివేల పెట్టుబడితో..

కేసు దర్యాప్తులో భాగంగా హరియాణాకు వెళ్లిన పోలీసులకు ఆశ్చర్యకర విషయాలు తెలిశాయి. మేవత్‌ ప్రాంతంలో దొంగతనం ఓ కుటీర పరిశ్రమలా కొనసాగుతోంది. అత్యాధునిక పద్ధతుల్లో ఏటీఎంల్లో నగదును కొల్లగొట్టడమే వీరి వృత్తిగా ఉంటుంది. తమ స్నేహితులు, బంధువుల పేరుతో వివిధ ప్రైవేటు బ్యాంకుల్లో తెరిచిన ఖాతాలకు సంబంధించిన ఏటీఎం కార్డులను సేకరిస్తారు. ఆ ఖాతాదారులకు కొట్టేసిన మొత్తంలో వాటా ఇస్తారు. ఆ తర్వాత దిల్లీకి వెళ్లి ఎంచుకున్న నగరానికి విమానంలో చేరుకుంటారు. ఈ సమయంలో వారు ఖర్చులకు పోనూ.. రూ.10వేలు మాత్రమే తెచ్చుకుంటారు.

కొద్ది రోజులు నగరంలో తిరుగుతూ.. కాపలాలేని ఎస్‌బీఐ ఏటీఎంలను గుర్తిస్తారు. అనంతరం వారి దగ్గర ఉన్న నగదును తమ వెంట తెచ్చుకున్న ఏటీఎం కార్డులో సంబంధిత బ్యాంకు డిపాజిట్‌ మిషన్‌ ద్వారా జమ చేస్తారు. అక్కడి నుంచి ఎస్‌బీఐ ఏటీఎంకి వెళ్లి ఆ నగదును తీసేందుకు ప్రయత్నిస్తారు. నగదు బయటకు వచ్చే సమయంలో రోల్‌ అయ్యే శబ్దం వచ్చినప్పుడు ఆ యంత్రానికి విద్యుత్తు సరఫరా చేసే ప్లగ్‌ను పీకేస్తారు. అనంతరం ఆ మిషన్‌లోకి చెయ్యి పెట్టి.. నగదును తీసుకుంటారు. ఇలా కాజేసిన మొత్తాన్ని ఎప్పటికప్పుడు తమ ప్రాంతంలోని వారికి పంపించేస్తున్నారు.

ఎస్‌బీఐ ఏటీఎంల్లోనే ఎందుకు..

*ఎస్‌బీఐ ఏటీఎంలలో నగదు తీసే సమయంలో విద్యుత్తు సరఫరా నిలిచిపోతే.. నగదును బయటకు తీసే వెసులుబాటు ఉంది. మిగతా వాటిలో వెంటనే ఆగిపోయే సాంకేతికత అందుబాటులో ఉంది.

*అలాగే ఏటీఎంలను పర్యవేక్షించేందుకు ఓ విభాగం ఉంది. ఏటీఎం కేంద్రాల్లో ఏదైనా సమస్య తలెత్తినా.. విద్యుత్తు సరఫరా నిలిచిపోయినా వీరికి వెంటనే తెలుస్తుంది. వీటిని పర్యవేక్షించిన సిబ్బంది ఊడిపోయిన ప్లగ్‌ను అమర్చతున్నారే తప్ఫ. విద్యుత్తు సరఫరా ఎందుకు నిలిచిపోయింది..? వెనకవైపు ఉన్న విద్యుత్తు ప్లగ్‌ను ఎవరు తీశారు..? అనే విషయాలను పట్టించుకోవడం లేదు.

*ఎస్‌బీఐ అధికారుల నిర్లక్ష్యమే దొంగతనాలకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఏడాది జులై 4వ తేదీ నుంచి ఆగస్టు 21వ తేదీ మధ్యలో 12 ఏటీఎంల్లో 419 సార్లు విద్యుత్తు సరఫరా నిలిపేసి రూ.41,50,500 కాజేసినా తెలుసుకోలేకపోవడం ఆశ్చర్యంగా ఉందని అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి:

ఏటీఎంలో కరెంటు తీస్తున్నారు... సొమ్ము కొట్టేస్తున్నారు!

Last Updated : Sep 14, 2020, 5:36 PM IST

ABOUT THE AUTHOR

...view details