ఏపీ ఈఏపీసెట్(AP EAPCET) ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్(Announcement for Engineering Admissions Counseling)కు ఈనెల 22న ప్రకటన విడుదల చేయనున్నారు. ప్రవేశాల కమిటీ నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 23నుంచి 30 వరకు రిజిస్ట్రేషన్‌కు అవకాశం ఇవ్వనున్నారు. అనంతరం కోర్సులు, కళాశాలల ఎంపిక వెబ్ ఐచ్ఛికాల నమోదుకు మరో 6 రోజులు సమయం ఇస్తారు. నవంబరు 15లోపు మొదటి కౌన్సెలింగ్ పూర్తి చేసి.. తరగతులు ప్రారంభించనున్నారు.
ఈఏపీసెట్ ఇంజినీరింగ్ ఫలితాలు విడుదల చేసి 40రోజులకుపైగా గడిచిన తర్వాత ప్రవేశాలకు ప్రకటన వెలువడుతోంది. మరో వైపు డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు వెబ్ ఐచ్ఛికాల నమోదుకు ఈనెల 18తో గడువు ముగిసింది. కోర్సులు, కళాశాలల ఎంపికకు రాష్ట్ర వ్యాప్తంగా 2,13,712మంది విద్యార్థులు వెబ్ ఐచ్ఛికాలు నమోదు చేసుకున్నారు. మొత్తం 2,50,180మంది ప్రవేశాలకు ఫీజు చెల్లించగా.. వీరిలో 2,45,301మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.