ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

polavaram : పోలవరం రివైజ్డ్‌ అంచనాలు..హైదరాబాదే దాటలేదు

పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాను కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఆమోదిస్తుందా అని ఆంధ్రప్రదేశ్‌ ఎదురు చూస్తోంది. ఏపీ ప్రభుత్వ ఉన్నతాధికారులు కేంద్ర జల్‌శక్తి, ఆర్థిక శాఖ అధికారులను కలిసినప్పుడల్లా తాజా అంచనాకు ఆమోదం తెలపాలని కోరుతున్నారు. కేంద్ర అధికారులూ అలాగే అని తల ఊపుతున్నారు. అయితే సవరించిన అంచనాల దస్త్రం అసలు హైదరాబాదే దాటకపోవడం గమనార్హం.

పోలవరం ప్రాజెక్టు
పోలవరం ప్రాజెక్టు

By

Published : Aug 21, 2021, 5:06 AM IST

హైదరాబాద్‌ నుంచి పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) కొర్రీల మీద కొర్రీలు వేయడం, అమరావతి నుంచి ఆంధ్రప్రదేశ్‌ సమాధానాలు ఇవ్వడమే తప్ప రివైజ్డ్‌ అంచనాల ప్రతిపాదన దిల్లీకి చేరనేలేదు. రెండు వారాల క్రితం కూడా పీపీఏ లేవనెత్తిన అంశాలకు రాష్ట్రం సమాధానాలిచ్చినా సవరించిన అంచనాల ప్రక్రియ ముందుకు కదలలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. తొమ్మిది నెలలైనా ఈ ప్రతిపాదన దిల్లీకి ఎందుకు పంపలేదనేది చర్చనీయాంశంగా మారింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 2014 ఏప్రిల్‌ 1 నుంచి అయ్యే వ్యయాన్ని మాత్రమే కేంద్రం భరించాలని 2020 అక్టోబరు 12న కేంద్ర ఆర్థిక శాఖ లేఖ రాసింది.

2013-14 ధరల ప్రకారం ఈ ప్రాజెక్టు సాగునీటి పనుల నిర్మాణ వ్యయం రూ.20,398.61 కోట్లని, ఇందులో 2014 మార్చి 31 వరకు రూ.4,730.71 కోట్లు ఖర్చు చేశారని, ఇక ఇవ్వాల్సింది రూ.15,660.96 కోట్లు మాత్రమేనని లేఖలో పేర్కొంది. 2014 ఏప్రిల్‌ 1 నుంచి రూ.8,614.16 కోట్లు ఇచ్చినందున, ఇక కేంద్రం ఇవ్వాల్సింది రూ.7,053.74 కోట్లు మాత్రమేనని పేర్కొనడం రాష్ట్ర అధికార వర్గాల్లో కలకలం రేపింది. పోలవరం నిర్మాణానికి నూరు శాతం వ్యయం కేంద్రమే భరించాల్సి ఉన్న నేపథ్యలో ఇలా పేర్కొనడం చర్చనీయాంశమైంది.

తొమ్మిది నెలలు దాటినా..

ఈ అంశంపై చర్చించేందుకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ నిరుడు నవంబరు 2న అత్యవసరంగా సమావేశమైంది. ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల శాఖ, కేంద్ర జల్‌శక్తి, ఆర్థిక శాఖల అధికారులతోపాటు పీపీఏ అధికారులు చర్చించి ఓ నిర్ణయానికి వచ్చారు. 2020 మార్చి 17న జరిగిన సవరించిన అంచనాల కమిటీ నిర్ణయం ప్రకారం 2013-14 అంచనా రూ.29,027.95 కోట్లుగాను, ఇందులో విద్యుత్తు బ్లాక్‌ వ్యయం రూ.4,560.91 కోట్లు, తాగునీటి సరఫరా రూ.4068.43 కోట్లు, సాగునీటి ప్రాజెక్టు వ్యయం రూ.20,398.61 కోట్లుగా పేర్కొంటూ ఆర్థిక శాఖ రాసిన లేఖకు ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌ కోరినట్లుగా తాగునీటి సరఫరా వ్యయాన్ని కలపడంపై కేంద్ర జల్‌శక్తి శాఖ నిర్ణయం తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమైంది. 2017-18 ధరల ప్రకారం సవరించిన అంచనా రూ.47,725.74 కోట్లకు పీపీఏ అంగీకరించింది. ఇందులో విద్యుత్తు బ్లాక్‌ ఖర్చు రూ.4,560.91 కోట్లు, తాగునీటి సరఫరా ఖర్చు రూ.7,214.67 కోట్లుగా పేర్కొంది. 2014 ఏప్రిల్‌ 1 నుంచి సాగునీటి ప్రాజెక్టుకయ్యే వ్యయం నూరు శాతం భరిస్తామని కేంద్ర మంత్రివర్గం పేర్కొందని, ప్రాజెక్టు పూర్తి కావడానికి 2017-18 ధరల ప్రకారం ఇవ్వాలని పీపీఏ పేర్కొంది. 2013-14 ధరల ప్రకారం చెల్లించేలా ఆర్థిక శాఖ జారీ చేసిన ఉత్తర్వుకు పీపీఏ ఆమోదం పొందిందనీ కేంద్రానికి నివేదించారు.

ఆరుసార్లు కొర్రీలు

ప్రాజెక్టు పూర్తి కావాలంటే 2017-18 ధరల ప్రకారం రూ.47,725.74 కోట్లు ఇవ్వాలని నిరుడు నవంబరులో పీపీఏ సమావేశం చేసిన తీర్మానాన్ని మాత్రం ఇప్పటి వరకూ కేంద్రానికి పంపలేదు. ప్రాజెక్టు ప్రతిపాదనలో లోపాలున్నాయంటూ 8 అంశాలకూ, ఆయకట్టు, వ్యయానికి సంబంధించి మరో తొమ్మిదింటికీ సమాధానాలు ఇవ్వాలంటూ ఈ ఏడాది ఫిబ్రవరిలో పీపీఏ ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల శాఖ కార్యదర్శికి లేఖ రాసింది. దానికి సమాధానం రాగానే పునరావాసం, కాలువల సామర్థ్యం, సొరంగాలు, కొత్తగా చేపట్టిన లిప్టు ఇలా పలు అంశాలపై కొర్రీలు వేస్తోంది. ప్రాజెక్టు చీఫ్‌ ఇంజినీర్‌, నీటిపారుదల శాఖ అధికారులు వాటికి సమాధానాలు ఇస్తూనే ఉన్నారు. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం ఆరుసార్లు పీపీఏ కొర్రీలు వేసినట్లు తెలిసింది. చివరగా గత నెలలో పీపీఏ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంతోపాటు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గత నెల 30న కేంద్ర జల్‌శక్తి కార్యదర్శికి అంశాల వారీగా సమాధానాలిస్తూ లేఖ రాశారు. ‘పోలవరం కుడికాలువ సామర్థ్యం మొదట 330 క్యూమెక్కులు. తర్వాత 496.2 క్యూమెక్కులకు పెరిగింది. దీనికి జలసంఘం కూడా ఆమోదం తెలిపింది. ఎడమ కాలువ సామర్థ్యం 230 క్యూమెక్కుల నుంచి 498.03 క్యూమెక్కులకు పెంచారు. వీటన్నిటికి 2004-05లోనే టెండర్లు పిలిచి ఆమోదం తెలిపారు’ అని లేఖలో ఏపీ వెల్లడించింది. పునరావాసం, సొరంగ మార్గాలు వెడల్పు చేయడం, డిస్ట్రిబ్యూటరీలు ఇలా అన్నింటి గురించీ వివరించింది. ఇంత వివరంగా సమాధానాలిస్తున్నా.. సవరించిన అంచనాకు సంబంధించి పీపీఏ చేసిన నిర్ణయం మాత్రం దిల్లీ చేరలేదని సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది.

అంచనా వ్యయం పెరిగింది ఇలా..

* పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 2009 జనవరిలో రూ.10,511 కోట్లతో కేంద్ర జలసంఘం సాంకేతిక సలహా కమిటీ ఆమోదం తెలిపింది.
* 2011 జనవరిలో రూ.16,010.45 కోట్లతో సవరించారు.
*2019 ఫిబ్రవరి 11న.. 2017-18 ధరలతో రూ.55,548.87 కోట్లకు సవరించిన అంచనాకు ఆమోదం తెలిపింది.
అయితే 2016లో కేంద్ర ఆర్థిక శాఖ వ్యయ విభాగం ఆదేశాల ప్రకారం.. ఆమోదం పొందిన ప్రాజెక్టు నిర్మాణ వ్యయం 20 శాతానికి మించి పెరిగితే ఆర్థిక సలహాదారు నేతృత్వంలోని అంచనాల సవరింపు కమిటీ (ఆర్‌సీసీ)కి వెళ్లాల్సి ఉంటుంది. అలా కేంద్ర జల్‌శక్తి శాఖ సలహా మండలి ఆమోదించిన రూ.55,548.87 కోట్ల ప్రతిపాదన ఆర్‌సీసీకి వెళ్లింది.
* 2020 మార్చి 17న జరిగిన ఆర్‌సీసీ సమావేశంలో 2013-14, 2017-18 ధరల ప్రకారం కేంద్ర జలసంఘం ప్రతిపాదించిన సవరించిన అంచనా వ్యయాన్ని అంచనాల కమిటీ ఆమోదించింది.
* చివరికి 2013-14 ధరల ప్రకారం రూ.29,027.95 కోట్లకు, 2017-18 ధరల ప్రకారం రూ.47,725.74 కోట్లకు ఆమోదం తెలిపింది.

ఇవీచదవండి.

RAHUL MURDER CASE : రాహుల్ హత్య కేసు... కీలక నిందితుల కోసం గాలింపు

Justice NV Ramana: అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ కేంద్రం ఏర్పాటుకు సహకారం

Afghan Crisis: అఫ్గాన్​లో ఆ రోజు ఏం జరుగుతుంది?

'టక్​ జగదీశ్' ఓటీటీ విడుదలపై​ ఎగ్జిబిటర్ల ఆందోళన

ABOUT THE AUTHOR

...view details