ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విజయవాడ టు హైదరాబాద్ వయా కృష్ణానది - water drome latest news

పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతున్న హరిత బెరంపార్కు, భవానీద్వీపం చెంతన నీటి విమానం ప్రాజెక్టు ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. కృష్ణానది నుంచి గోదావరి పాపికొండలు, నాగార్జునసాగర్, హైదరాబాద్‌లోని హుస్సేన్​సాగర్‌కు నీటి విమానం రాకపోకల ప్రక్రియ త్వరలో పట్టాలెక్కనుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, సాంకేతిక బృందం అధ్యయనం పూర్తైంది. సాంకేతిక అంశాలను మరోసారి పరిశీలించి పనులు ప్రారంభించే అవకాశం ఉంది.

Andhra to bring water drome facility in Krishna River in Vijayawada
విజయవాడ టు హైదరాబాద్ వయా కృష్ణానది

By

Published : Feb 9, 2020, 6:17 AM IST

విజయవాడ టు హైదరాబాద్ వయా కృష్ణానది

రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి వాటర్‌ డ్రోమ్ ప్రాజెక్టు మంచిదని ప్రభుత్వం భావిస్తోంది. దేశవ్యాప్తంగా పలుచోట్ల వాటర్ డ్రోమ్ ప్రాజెక్టులను కేంద్రం ప్రోత్సహిస్తున్న సమయంలో ఏపీ నుంచి నీటి విమానాలు నడిపేందుకు అనేక సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. ఈ ప్రాజెక్టుల వ్యవహారాలను పౌర విమానయానశాఖ చూస్తుండగా... రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రాజెక్టు ముందుకెళ్లనుంది. సాంకేతిక కమిటీ సిఫార్సుల ప్రకారం అధ్యయన నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపనున్నారు. భవానీద్వీపం వేదికగా నీటివిమానం ప్రాజెక్టుకు అనువైన పరిస్థితులు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం, పౌరవిమానయానశాఖ ఉన్నతాధికారుల బృందం గుర్తించింది. ప్రాజెక్టు మౌలిక అవసరాలు, సాంకేతిక అంశాలపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసింది.

బెజవాడ నగరాన్ని పర్యాటక వలయం కింద తీసుకురావడానికి వీలుగా ప్రకాశం బ్యారేజీ నుంచి బెరంపార్కు, భవానీ ద్వీపం ప్రాంతాలు అనువుగా ఉన్నట్లు గుర్తించారు. భవానీద్వీపం, ఇంద్రకీలాద్రిని సైతం ఈ వలయం కిందికి తీసుకురావాలని నిర్ణయించారు. విజయవాడ నుంచి నీటి విమానాన్ని గోదావరి నదికి అనుసంధానం చేయడానికి పాపికొండలు అనువైన ప్రాంతంగా నిర్ణయించారు. ఇంతకు ముందు పరిశీలనలో కృష్ణానది, నాగార్జునసాగర్, హుస్సేన్‌ సాగర్ అనుకోగా... రెండో పర్యటనలో గోదావరి నదిని కూడా అనుసంధానం చేయాలని భావిస్తున్నారు.

విజయవాడ నుంచి కృష్ణానది మీదుగా నీటి విమానంలో హైదరాబాద్ చేరుకోవడం తేలిగ్గా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. సాధారణ విమానాల కంటే త్వరగా హైదరాబాద్ చేరే అవకాశాలు ఉన్నందున... వీటికి ఆదరణ ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. కృష్ణానది ఒడ్డున నీటివిమానం ప్రాజెక్టు ఏర్పాటుకు రెండెకరాల స్థలం అవసరమని సాంకేతిక కమిటీ అభిప్రాయపడగా... ప్రాజెక్టుకు వాటర్ డ్రోమ్, స్టేషన్, విమానాల పార్కింగ్ కోసం నది ఒడ్డునే రెండు ఎకరాల భూమి అవసరమవుతుందని నిర్ణయించారు.

త్వరలో మరోసారి సాంకేతిక కమిటీ క్షేత్ర స్థాయిలో పరిశీలించిన తర్వాత భూములెక్కడ కావాలన్నఅంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు కోసం 60 కోట్ల రూపాయలు అంచనా వేయగా... కేంద్ర పౌరవిమానయాన సంస్థ 50 కోట్లు అవుతుందని అంచనాతో ఉంది. మౌలిక వసతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 10 కోట్లు కేటాయించనుంది.

ఇదీ చదవండీ... "మనకృష్ణ"తో ప్లాస్టిక్ రహితంగా విజయవాడ..!

ABOUT THE AUTHOR

...view details