ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మహిళలపై నేరాలు.. దేశంలో మొదటి స్థానంలో ఏపీ - మహిళలపై నేరాల్లో ఏపీ టాప్

మహిళలపై నేరాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండటం కలవరపెడుతోంది. లైంగిక వేధింపులు, అత్యాచారాలతోపాటు మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించే ఘటనలు పెరిగాయని ఎన్​సీఆర్​బీ తెలిపింది. ఈ తరహా ఘటనలపై 2019లో 1,892 కేసులు నమోదవగా... 2020లో 2,942 కేసులు రికార్డయ్యాయి.

crime
crime

By

Published : Apr 25, 2022, 5:52 AM IST

మహిళలపై నేరాలు.. దేశంలో మొదటి స్థానంలో ఏపీ

మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించే ఘటనల్లో దేశంలో ఏపీ మొదటి స్థానంలో ఉందని... 2020 జాతీయ నేరాల గణాంకల నివేదిక తెలిపింది. 2020లో దేశవ్యాప్తంగా జరిగిన ఈ తరహా ఘటనల్లో 33.14 శాతం మన రాష్ట్రంలోనే నమోదవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. స్త్రీలపై జరిగిన మొత్తం నేరాల్లో స్వల్ప తగ్గుదల కనిపిస్తున్నా... భౌతిక దాడులు తగ్గకపోవడం కలవరపరుస్తోంది.

ఈ తరహా ఘటనలకు సంబంధించి 2019లో 1,892 కేసులు నమోదు కాగా.... 2020లో ఆ సంఖ్య 2,942 కు పెరిగింది. ఏడాది వ్యవధిలో ఈ తరహా ఘటనలు 23.78 శాతం మేర అధికమయ్యాయి. 2019లో మహిళలపై 17,746నేరాలు, 2020లో 17,089 నేరాలు జరిగాయి. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 2020లో 3.70 శాతం మేర తగ్గాయి. ఈ తరహా నేరాలు అత్యధికంగా జరిగిన రాష్ట్రాల జాబితాలో 2019లో పదో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్... 2020లో ఎనిమిదో స్థానానికి చేరింది. 2019లో దేశవ్యాప్తంగా మహిళలపై జరిగిన నేరాల్లో 4.87 శాతం ఏపీలోనే ఉండగా.... 2020లో 4.59 శాతంగా ఉంది.
2019 కంటే 2020లో సైబర్ నేరాలు, చిన్నారులపై నేరాలు కొంతమేర పెరిగాయని నేర గణాంకాలు చెబుతున్నాయి. మహిళలపై నేరాల్లో 9వ స్థానం, చిన్నారులపై నేరాల్లో 16, ఆర్థిక నేరాల్లో 9, సైబర్ నేరాల్లో 7వ స్థానం, వృద్ధులపై నేరాల్లో 4, ఎస్సీ-ఎస్టీలపై నేరాల్లో 8, హత్యల్లో 15వ స్థానం, హింసాత్మక నేరాల్లో 17వ స్థానంలో ఏపీ ఉన్నట్లు... ఎన్​సీఆర్​బీ నివేదిక తెలిపింది.

పని ప్రదేశాల్లో మహిళల్ని లైంగికంగా వేధించిన ఘటనల్లో 72 కేసులతో హిమాచల్ ప్రదేశ్ దేశంలో మొదటి స్థానంలోనూ, 70 కేసులతో ఏపీ రెండో స్థానంలోనూ ఉన్నట్లు ఎన్​సీఆర్​బీ నివేదిక చెబుతోంది. స్త్రీలను రహస్యంగా చిత్రీకరించిన ఘటనలు అత్యధికంగా జరిగిన రాష్ట్రాల జాబితాలో ఏపీది రెండో స్థానమని నివేదిక తెలిపింది. అత్యధికంగా మహారాష్ట్రలో ఈ తరహా కేసులు 201 నమోదు కాగా, ఏపీలో 124 కేసులు ఉన్నాయి. మహిళలను వేధించిన ఘటనల్లో మహారాష్ట్రలో 2వేల 13, తెలంగాణలో 14వందల 38 తర్వాత... 956 కేసులతో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉందని ఎన్​సీఆర్​బీ వెల్లడించింది. అత్యాచారాలు 0.82 శాతం మేర పెరిగినట్లు పేర్కొంది.

ఇదీ చదవండి:కండోమ్ లేకుండా సెక్స్.. 17లక్షల మందికి హెచ్​ఐవీ​.. ఆంధ్రప్రదేశ్​ టాప్!

ABOUT THE AUTHOR

...view details