ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జాతీయ రహదారులపై మోదీ, గడ్కరీ ముందుచూపు: సీఎం జగన్

కేంద్ర ప్రభుత్వం సహకారంతో.. రాష్ట్రంలోని రోడ్ల రూపురేఖలను మార్చేస్తామని అన్నారు ముఖ్యమంత్రి జగన్. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరితో కలిసి వర్చువల్ గా పలు రహదారులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. దేశవ్యాప్తంగా రహదారుల అభివృద్ధి వేగంగా సాగుతోందని కితాబిచ్చిన జగన్.. కేంద్రం అండతో రాష్ట్రంలోనూ రహదారుల అభివృద్ధి చేపడుతున్నామన్నారు.

కేంద్రం సహకారంతో.. రాష్ట్రంలో రోడ్ల రూపురేఖలు మార్చేస్తాం: జగన్
కేంద్రం సహకారంతో.. రాష్ట్రంలో రోడ్ల రూపురేఖలు మార్చేస్తాం: జగన్

By

Published : Feb 17, 2022, 3:47 PM IST

Updated : Feb 18, 2022, 4:00 AM IST

మాట్లాడుతున్న సీఎం జగన్

‘ప్రధాని మోదీ, గడ్కరీ ముందుచూపుతో దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల ప్రాజెక్టులు ప్రగతిలో ఉన్నాయి. 2014 నాటికి దేశంలో రోజుకు 12 కి.మీ. జాతీయ రహదారులు నిర్మాణమయ్యేవి. ఇప్పుడు అది 37 కి.మీ.కి చేరింది. 2014లో రాష్ట్రంలో 4,193 కి.మీ మేర జాతీయ రహదారులు ఉండగా, ఇపుడు 8,163 కి.మీ.కు పెరిగాయి. రాష్ట్రానికి కేంద్రం తరపున మీరు చేసిన మంచి పనులకు ఎటువంటి సంకోచం, రాజకీయాలు లేకుండా ప్రజల ముందు కృతజ్ఞత తెలియజేస్తున్నా’ అని సీఎం జగన్‌ తెలిపారు. ‘బెంజ్‌ సర్కిల్‌ వద్ద రద్దీని దృష్టిలో పెట్టుకొని పశ్చిమవైపు మరో వంతెన నిర్మించాలని 2019 ఆగస్టులో అభ్యర్థించాం. 2020లో నిర్ణయం తీసుకోవడంతోపాటు, వేగంగా నిర్మాణం చేశారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణ, అభివృద్ధి, నిర్మాణంలో మా ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. భూసేకరణ సహా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా వేగంగా నిర్మాణాలు జరిగేలా చొరవ తీసుకుంటోంది. రాష్ట్రంలోని ఇతర రహదారుల పనులనూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాం. రూ.10,600 కోట్లతో పనులు చేస్తున్నాం’ అని జగన్‌ చెప్పారు.

ఈ రహదారులు మంజూరు చేయండి

‘విశాఖ పోర్టు నుంచి రుషికొండ, భీమిలి మీదుగా భోగాపురంలో కొత్తగా నిర్మించే అంతర్జాతీయ విమానాశ్రయానికి, అక్కడి నుంచి ఎన్‌హెచ్‌-16కి అనుసంధానం చేసేలా ఆరు వరుసల రహదారి అవసరం. విజయవాడ తూర్పు వైపు కృష్ణా నదిపై వంతెన, 40 కి.మీ. బైపాస్‌ నిర్మిస్తే, నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్‌ సమస్య తీర్చేందుకు అవకాశం ఉంటుంది. కడప జిల్లా భాకరాపేట నుంచి బద్వేలు, పోరుమామిళ్ల మీదుగా ప్రకాశం జిల్లా బేస్తవారిపేట వరకు, చిత్తూరు జిల్లాలోని పుంగనూరు, పులిచెర్ల మీదగా చిన్నగొట్టిగల్లు వరకు, విశాఖ జిల్లా సబ్బవరం నుంచి చోడవరం, నర్సీపట్నం మీదుగా తుని వరకు, విశాఖపట్నం నుంచి నర్సీపట్నం, చింతపల్లి, చింతూరు మీదగా భద్రాచలం వరకు రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించి అభివృద్ధి చేయాలి’ అని సీఎం కోరారు.

గడ్కరీ గౌరవార్థం విందు

గురువారం విజయవాడలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న గడ్కరీ తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లారు. ఆయన గౌరవార్థం ముఖ్యమంత్రి విందు ఇచ్చారు. అనంతరం రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతిపాదనలపై సీఎం ఆయనతో చర్చించారు. విజయవాడకు పశ్చిమ బైపాస్‌తో పాటు, 40 కి.మీ.ల మేర తూర్పు బైపాస్‌ నిర్మాణం కూడా చేపడితే ట్రాఫిక్‌ కష్టాలు తగ్గుతాయన్నారు. ఆ ప్రాజెక్టుతో పాటు, 33 ఆర్వోబీల్ని మంజూరు చేసినందుకు గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రాభివృద్ధిలో విశాఖపట్నం- భీమిలి- భోగాపురం బీచ్‌కారిడార్‌ రోడ్డు కీలకంగా మారనుందని, పర్యాటకాభివృద్ధికీ ఎంతో తోడ్పడుతుందని గడ్కరీకి వివరించారు. భోగాపురంలో నిర్మించనున్న అంతర్జాతీయ విమానాశ్రయానికి విశాఖ నుంచి త్వరగా చేరుకోవాలన్నా ఆ రహదారి ఎంతో అవసరమన్నారు. ఆ ప్రాజెక్టుపై సానుకూలంగా స్పందించిన గడ్కరీ, ఏదైనా అంతర్జాతీయ కన్సల్టెన్సీతో ప్రతిపాదనలు తయారు చేయించాలని సూచించారు. సమావేశంలో రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి శంకరనారాయణ, ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు తదితరులు పాల్గొన్నారు.

Last Updated : Feb 18, 2022, 4:00 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details