అమరావతి పోరాటంలో అంతిమ విజయం సాధించేవరకూ రైతులకు అండగా ఉంటామని ఎన్‌ఆర్‌ఐ తెదేపా సమన్వయకర్త కోమటి జయరామ్ పేర్కొన్నారు. ‘రాష్ట్రంలో నియంతృత్వ పాలన నడుస్తోంది. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం మాదిరే.. రాష్ట్రానికి వైకాపా గ్రహణం పట్టింది. అమరావతికి కుల, మతాల్ని అంటగట్టి నిర్వీర్యం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. నియంత పాలన పోయేవరకూ పోరాడాలి’ అని రైతులకు సూచించారు. శనివారం విజయవాడలో జరిగిన ‘ఆంధ్రుల రాజధాని అమరావతి’ పుస్తక ద్వితీయ ముద్రణ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అమరావతి చరిత్రను పుస్తక రూపంలో తేవడం అభినందనీయమని, డిజిటల్‌లోనూ అందుబాటులో ఉంచితే మరింత మందికి చేరువ అవుతుందన్నారు. ‘ఎన్‌ఆర్‌ఐలుగా అమరావతికి చేయగలిగినంత చేస్తున్నాం.. ఈ ప్రాంతానికి మా వంతు సేవ చేయడం గొప్పతనం కాదు, బాధ్యత’ అన్నారు.
ఎవరి రాజధాని చదివాకే.. అమరావతిపై పుస్తక ఆలోచన వచ్చింది
మేమేమీ పెద్ద రచయితలం కాదు.. ఎవరి రాజధాని అమరావతి అని మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు రాసిన పుస్తకం చదివాక.. కన్నీళ్లు తిరిగాయి. రాజధాని రైతుల త్యాగాలను అవమానించేలా తప్పుడు కథ]నాలు రాస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని అర్థమైంది. వాస్తవాలను వెలుగులోకి తేవాలనే ‘ఆంధ్రుల రాజధాని అమరావతి’ పుస్తకం తెచ్చాం. దీని తొలి ముద్రణ కోసం మాకున్న స్థలాన్ని రూ.4.50 లక్షలకు అమ్మాం. 2019లో చంద్రబాబు చేతులమీదుగా ఆవిష్కరించాం. మరిన్ని మార్పులతో ద్వితీయ ముద్రణకు కోమటి జయరాం, జాగర్లమూడి శివాని, ఉప్పుటూరి రామ్‌చౌదరి.. వీరంతా సహకరించారు.- ఉన్నం బద్రర్స్, పుస్తక రచయితలు
పుస్తక ట్యాగ్‌లైన్‌గా రూపశిల్పి చంద్రబాబు
‘ఆంధ్రుల రాజధాని అమరావతి’ పుస్తక ట్యాగ్‌లైన్‌గా రూపశిల్పి, నారా చంద్రబాబు నాయుడు అని పేర్కొన్నారు. తెలుగు వారి తొలి రాజధానిగా అమరావతి, వాసిరెడ్డి వెంకట్రాద్రినాయుడు పాలన, ఆంధ్ర ప్రశస్తి, రాష్ట్ర విభజన తర్వాత అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా నిర్ణయించడం, భూసమీకరణ, ప్రధాని మోదీ శంకుస్థాపన తదితర అంశాలను వివరించారు. రాజధానిలో భూముల కేటాయింపు, భవన ఆకృతులు, అభివృద్ధి కార్యక్రమాలు, నగర నిర్మాణానికి ప్రజల విరాళాలు, చంద్రబాబుకు ప్రముఖుల ప్రశంసలు, పరిసర ప్రాంతాల్లో పరిశ్రమలు, వివిధ ప్రభుత్వ సంస్థల ఏర్పాటును చిత్రాలతో తెలియజేశారు.
ఇంటర్‌తో ఆపిన వ్యక్తికి రెవెన్యూ మంత్రి పదవి
అమరావతికి సంబంధించి హైకోర్టు తీర్పుపై అసెంబ్లీలో చర్చ పెట్టిన వ్యక్తికి రాష్ట్ర మంత్రిపదవి ఇచ్చారు. అదే ఆయనకు అర్హత అయింది. చదువురాక ఇంటర్‌తో ఆపేసిన వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చారు. ఆయన ఐఏఎస్, ఇతర రెవెన్యూ అధికారులకు మంత్రి. అమరావతిపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు. అమరావతిపై పోరాట రూపు మారాలి- తాడికొండ శ్రావణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే
జగన్‌ను గద్దె దించడం ద్వారా అమరావతిని నిలబెట్టాలి
అమరావతిని అభివృద్ధి చేస్తామని జగన్ ముందుకు రావాలి.. లేదంటే ఆయన్ను గద్దె దించడం ద్వారా అమరావతిని నిలబెట్టుకోవడానికి సిద్ధం కావాలి. కోర్టు తీర్పును అమలుచేసేలా ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి. మహిళలే లేకపోతే, 851 రోజుల ఉద్యమమే సాగకపోతే అమరావతికి ఈనాటి ఆత్మస్థైర్యమూ ఉండేది కాదు. - ముప్పాళ్ల నాగేశ్వరరావు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి
పచ్చి బాలింతరాల్ని పొత్తికడుపుపై తన్నారు..
పచ్చి బాలింతరాల్ని పొత్తికడుపుపై తన్నిన రాజ్యంలో జీవిస్తున్నందుకు బాధపడుతున్నా. అమరావతి రైతులకు న్యాయస్థానం ఉపశమనం కల్పించింది. త్వరలోనే దేవస్థానమూ తీర్పు ఇవ్వబోతోంది. గోవిందనామ స్మరణ చేసే ప్రదేశంలో డౌన్‌డౌన్ అనే మాటలు వినిపించాయి. పతనం మొదలైంది. అమరావతిపై విషం కక్కేవారంతా ఆంధ్రప్రజలకు శత్రువులే. వారిని ఎప్పటికైనా దూరంగా పెట్టాల్సిందే.- అడుసుమల్లి శ్రీనివాసరావు