తమకు కౌలును చెల్లించాలని కోరిన అమరావతి రాజధాని ప్రాంత రైతులను పోలీసులు అరెస్టు చేయడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఖండించారు. అమరావతి రాజధాని కోసం 28 వేల మంది రైతులు 33 వేల ఎకరాల భూమిని త్యాగం చేశారని చెప్పారు. అందుకనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామన్న వార్షిక కౌలు చెల్లించలేదని... ఈ విషయమై గతంలో సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖామంత్రి బొత్స సత్యనారాయణతో మాట్లాడితే- రైతులకు కౌలు చెలిస్తామని హామీ ఇచ్చారే గానీ ఇంతవరకు అమలు కాలేదన్నారు.
కౌలు చెల్లించకపోగా...అరెస్టులు చేయటం దారుణం: సీపీఐ రామకృష్ణ - సీపీఐ రామకృష్ణ వార్తలు
రాష్ట్ర ప్రభుత్వం బకాయిపడ్డ కౌలును చెల్లించాలని కోరుతూ... అమరావతి రైతులు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి అరెస్టులు చేయడం దుర్మార్గమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అమరావతి రైతులపట్ల వివక్షత చూపుతోందన్నారు. ఇప్పటికే 10 వేల కోట్ల వ్యయంతో అభివృద్ధి జరిగిన అమరావతిని ధ్వంసం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయతిస్తోందని ఆరోపించారు. ఇందులోభాగంగానే రాజధానిని తరలించేందుకు హుటాహుటిన నిర్ణయాలు తీసుకోవడం, అమరావతి రైతులకు కౌలు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేయడం, అరెస్టులు, నిర్భంధాలు, లాఠీచార్జీలకు పాల్పడం జరుగుతోందన్నారు. అమరావతి రాజధాని రైతులను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి, మంత్రుల రెండు నాల్కల ధోరణిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తక్షణమే అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని,...బకాయి పడ్డ కౌలును చెల్లించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి:రాజధానిగా అమరావతివైపే ప్రజల మొగ్గు... వెబ్‌సైట్ పోలింగ్‌లో 93 శాతం మంది ఓటు