పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. నేను తేదీ ఏదీ చెప్పడం లేదన్నారు. ముందు డయాఫ్రం వాల్ సమస్య తేలాలి.. దాన్ని బట్టే పోలవరం ఎప్పటికి పూర్తి చేయగలమనేది తేలుతుందని స్పష్టం చేశారు. ఈ మొత్తం సమస్యకు చంద్రబాబు మిడిమిడి జ్ఞానమే కారణమని విమర్శించారు. చంద్రబాబు చరిత్రాత్మక తప్పిదాల వల్ల, ఆయన ఒక ప్రణాళిక లేకుండా ప్రాజెక్టు పనులు చేపట్టడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ‘మొదట నేను చెప్పేది పూర్తిగా వినండి. మధ్యలో అడ్డు రావద్దు.. ఆ తర్వాత మీరు ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెబుతా’ అంటూ పోలవరం ప్రాజెక్టుపై శనివారం విలేకరుల సమావేశం ప్రారంభించిన రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు ‘ఈనాడు’ విలేకరి ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పలేదు. మా వార్తను విమర్శించారు కదా డిబేట్ చేద్దాం అని ‘ఈనాడు’ ప్రతినిధి అంటే మీతో డిబేట్ చేయను.. మీ ప్రశ్నలకు సమాధానం చెప్పను.. దయ చేయొచ్చు అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ‘పోలవరంలో ఎవరిది వైఫల్యం’ అంటూ ఈనాడు రాసిన వార్తలపై విమర్శలు గుప్పించారు. అంబటి ఏమన్నారో ఆయన మాటల్లోనే..
‘పోలవరం ప్రాజెక్టులో ప్రస్తుతం డయాఫ్రం వాల్ దెబ్బతింది. ప్రధాన డ్యాం నిర్మించాల్సిన చోట పెద్ద పెద్ద గుంతలు పడ్డాయి. అక్కడ నీళ్లు తోడివేయాలంటే రూ.2,100 కోట్లు ఖర్చవుతుంది. డ్రెడ్జింగ్ చేయాలంటే రూ.800 కోట్లవుతుంది. నిపుణులు వచ్చి పరిశీలిస్తున్నారు. డయాఫ్రం వాల్ కొత్తది నిర్మించాలా, పాతది సరిదిద్దాలా అని తర్జనభర్జన పడుతున్నారు. వారిచ్చే నివేదిక ఆధారంగానే ముందుకెళ్లాలి. ఈలోగా చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా ఈ వైఫల్యాలు ముఖ్యమంత్రి జగన్‌వి, ఈ ప్రభుత్వానివి అని రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం తాత్సారం చేయడం వల్లే డయాఫ్రం వాల్ విచ్ఛిన్నమైందని రాశారు. తొలుత స్పిల్‌వే నిర్మించి గోదావరి నదిని మళ్లించి, ఆ తర్వాత కాఫర్ డ్యాంలు కట్టి డయాఫ్రం వాల్ నిర్మించి ఉంటే ఈ సమస్య వచ్చి ఉండేది కాదు. పునరావాసం పూర్తి చేయకపోవడం వల్లే ఎగువ కాఫర్ డ్యామ్‌ను మధ్యలో గ్యాప్‌లతో వదిలేశారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలుత పునరావాసం కల్పించి, ఆ తర్వాత ఎగువ కాఫర్ డ్యాం నిర్మించాం. స్పిల్ వే నిర్మించాం. పోలవరంలో అన్ని పనులూ సమాంతరంగా చేసేందుకు ప్రయత్నించడం వల్లే ఈ ఇబ్బంది ఎదురయింది. కాఫర్ డ్యాంలు సగం సగం కట్టి.. డయాఫ్రం వాల్ నిర్మించడం చారిత్రక తప్పిదం కాదా అని ప్రశ్నిస్తున్నా.
మీ ఇష్టమొచ్చినట్లు రాసుకోండి..
జలవనరుల మంత్రి తాను చెప్పదలుచుకున్నది పూర్తయిన తర్వాత విలేకరులను ప్రశ్నలు అడగమన్నారు. ‘ఈనాడు’ విలేకరి ప్రశ్నలు అడిగితే రాంబాబు రుబాబు ప్రదర్శించారు. విలేకరి.. సర్ అని ప్రశ్నలు అడిగినా ఆయన ఏకవచనంతో నువ్వు నువ్వు అంటూ అభ్యంతరకరంగా మాట్లాడారు. ఒక్కో పత్రికకు ఒక్కో సమాధానం ఉంటుందన్నారు. ప్రశ్నలు వేయకుండానే నువ్వు ఆగవయ్యా.. నువ్వు ఆగు.. నాలా ఎందుకు ఆవేశపడుతున్నావంటూ తనే ఆవేశపడుతూ అసహనం ప్రదర్శించారు.
ఈనాడు: పోలవరంలో ఈ నిర్ణయాలు తీసుకున్నది చంద్రబాబు అని చెబుతున్నారు. వీటికి కేంద్ర జలసంఘం, డ్యాం డిజైన్ రివ్యూ కమిటీ ఆమోదం ఉందా లేదా?
మంత్రి అంబటి: ఉండి ఉండొచ్చు
ఈనాడు: ఉండి ఉండొచ్చు అని కాదు సర్, ఉందా లేదా కచ్చితంగా చెప్పండి
మంత్రి: ఏమిటి ఆవేశపడుతున్నారు? మీది ఏ పత్రిక?
మరో విలేకరి:పత్రికలను బట్టి సమాధానం ఉంటుందా అండీ?
మంత్రి: ఉంటుంది. ఈనాడు వారికి ఒక సమాధానం ఉంటుంది. ఆంధ్రజ్యోతికి మరో సమాధానం ఉంటుంది. మిగిలినవారికి వేరేగా ఉంటుంది. ఈనాడు వారికి చాలా ప్రత్యేక సమాధానం ఉంటుంది. ఆంధ్రజ్యోతి వారికి ఇంకా ప్రత్యేక సమాధానం ఉంటుంది. ఇందులో ఏం సందేహం లేదు. మీరు దురుద్దేశపూర్వకంగా ఉన్నారు. చంద్రబాబును అధికారంలోకి తీసుకురావాలని తొందరపడుతున్నారు.
ఈనాడు విలేకరి నిజం ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుందా? అని ప్రశ్నించబోగా.. మంత్రి కల్పించుకుంటూ ‘ఆగండి మీరు కంగారు పడతారెందుకు, ఆవేశపడకండి..మీ జీతాలు మీకు వస్తాయి.. నాలాగా ఎందుకు ఆవేశపడతావు?’ అన్నారు.
మంత్రి: పీపీఏ అనుమతి ఉందా లేదా సీడబ్ల్యుసీ అనుమతి ఉందా లేదా అంటున్నారు. ఉండొచ్చు!
ఈనాడు:అది కాదు సర్.. ఉందా లేదా చెప్పండి. ఇప్పటికే అది జరిగిపోయిన అంశం. మీరు మంత్రి కాబట్టి ఆ నిర్ణయాలకు కేంద్ర జలసంఘం, డ్యాం డిజైన్ రివ్యూ కమిటీ ఆమోదం ఉందా లేదో స్పష్టంగా చెప్పండి.
అంబటి:ఉంది. వారి అనుమతి తర్వాతే ఈ పనులు అన్నీ జరిగాయి.
ఈనాడు:ఈ నిర్ణయాలు అజ్ఞానంతో, మిడిమిడి జ్ఞానంతో తీసుకున్నవని మీరు అన్నారు. కేంద్ర జలసంఘం, పోలవరం అథారిటీ, డ్యాం డిజైన్ రివ్యూ ప్యానెల్ అనుమతి ఉన్నందున వారిదీ మిడిమిడి జ్ఞానం అంటారా?
మంత్రి:ఎవరైనా సరే ఇది అజ్ఞానంతో చేసిన పని. కేంద్ర జలసంఘాన్ని, డీడీఆర్‌పీని నాతో విమర్శించేలా చేయాలనుకుంటున్నావేమో. నేను అలా చేయను.
ఈనాడు:మేం రాసిన వార్తను మీరు నేరుగా విమర్శిస్తున్నారు. అందువల్ల నేను ప్రశ్నిస్తున్నాను.
మంత్రి:నీకేం కావాలి, అడుగు!
ఈనాడు:ఈ నిర్ణయాలు అజ్ఞానమైనవని అన్నారు. పీపీఏ, సీడబ్ల్యూసీ, డీడీఆర్‌పీ ఆమోదం ఉందంటున్నారు. వారిదీ అజ్ఞానమే అని మీరు చెబుతున్నారా?
మంత్రి:నువ్వు రేపు రాయదలుచుకున్నది అదే కదా.. ఏం హెడ్డింగు పెట్టుకుంటావో పెట్టుకో.
ఈనాడు:మీరు ఏం చెబితే అదే రాస్తాం..