న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు అమరావతి రైతులు, మహిళలు నిర్వహిస్తోన్న 45 రోజుల మహా పాదయాత్రకు సంఘీభావంగా యాత్రలు నిర్వహించాలని అమరావతి మహిళా ఐకాస తీర్మానించింది. విజయవాడలోని అమరావతి ఐకాస కార్యాలయంలో ఈ మేరకు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పక్షాల ప్రతినిధులు పాల్గొని తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఈ నెల 23న విజయవాడ బీఆర్‌టీఎస్ రహదారిలో సంఘీభావ యాత్ర చేయనున్నట్లు ఐకాస ప్రతినిధులు తెలిపారు. అమరావతి రాజధాని కేవలం 29 గ్రామాలకు చెందినదే కాదని.. రాష్ట్ర ప్రజలందరిదీ అనే భావన మహాపాదయాత్రకు ప్రజల నుంచి లభిస్తోన్న స్పందన ద్వారా తెలుస్తోందన్నారు. మహిళలు ఎన్నో త్యాగాలకు ఓర్చి ఈ పాదయాత్ర చేస్తున్నారన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా అమరావతినే రాష్ట్రానికి ఏకైక రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.
భారీ వర్షంతో పాదయాత్రకు విరామం
రాజధాని పాదయాత్రకు మద్దతు ఇస్తున్నవారిపై పోలీసులు కేసులు పెట్టడాన్ని ఐకాస నేత శివారెడ్డి తప్పుపట్టారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కూడా పాదయాత్రకు మద్దతిచ్చారని ఆయనపై కూడా కేసులు పెడతారా అని ప్రశ్నించారు. వర్షం కారణంగా విధిలేని పరిస్థితుల్లో ఇవాళ పాదయాత్రకు విరామం ఇచ్చినట్లు ఐకాస నేత గద్దె తిరుపతిరావు తెలిపారు. పాదయాత్ర చేస్తున్న మహిళలు, రైతులపై మంత్రులు చేస్తున్న విమర్శలను రైతు ఐకాస కన్వీనర్ పువ్వాడ సుధాకర్ తిప్పికొట్టారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా గుడ్లూరులో రైతులు బస చేస్తున్నారు.
అమరావతి రైతుల పాదయాత్రకు నా మద్దతు: నటుడు శివాజీ