ప్రజా రాజధాని కోసం విజయవాడలో అమరావతి ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ చేపట్టిన ఉద్యమం ఈ నెల 17వ తేదీకి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా అమరావతి జేఏసీ పిలుపు మేరకు విజయవాడలో మహాపాదయాత్ర నిర్వహించారు. మధ్యాహ్నం 3గంటలకు పడవల రేవు సెంటర్ వద్ద ప్రారంభమైన ఈ యాత్ర బీఆర్టీఎస్ రహదారిలో దాదాపు 5 కిలోమీటర్ల మేర 3గంటల పాటు సాగింది. చిన్నా పెద్దా తేడా లేకుండా మహిళలు, రైతులు, ప్రజలు వేలసంఖ్యలో కదం తొక్కారు.
నిర్ణయం మారే వరకు పోరు ఆగదు
భారీ మానవహారంగా ఏర్పడి అమరావతికి మద్దతుగా, మూడు రాజధానులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జగన్ నిరంకుశ విధానాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని మహిళలు ఆక్షేపించారు. మూడు రాజధానులతో రాష్ట్రం అధోగతి పాలవుతుందని.. సీఎం జగన్ అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రం మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని నినాదాలు చేశారు. నిర్ణయం మారే వరకు పోరు ఆగదని తేల్చిచెప్పారు.
కదం తొక్కారు
ఒకే రాజధాని కోసం ఒకే గొంతుకగా అన్ని వర్గాలు ఏకతాటిపైకి వచ్చి తమ గళం వినిపించాయి. ఆకుపచ్చ జెండాలతో సాగిన ఈ పాదయాత్రతో బెజవాడ బీఆర్టీఎస్ రహదారి హరితమయంగా మారింది. ప్రజా రాజధాని అమరావతి కోసం ప్రజాపాదయాత్ర విజయవంతం అయింది. తొలుత వందలు.. ఆపై.. వేల మంది తరలివచ్చారు. ఉప్పెనలా ముందుకు కదిలారు. చిన్నారులు, యువత, మహిళలు, వృద్ధులు, రైతులు, ప్రజా సంఘాలు, రాజకీయ నేతలు.. ఇలా అన్ని వర్గాల వారు పదం పదం కలిపారు. దాదాపు 5 కిలోమీటర్ల పాదయాత్రను సైతం సునాయాసంగా పూర్తి చేశారు. 3గంటల పాటు నడిచినా ఏమాత్రం అలసట లేకుండా కదం తొక్కారు. ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాల్సిందే అని నినాదాలు చేశారు. ఏడాదిగా ముందుండి అమరావతి ఉద్యమాన్ని నడిపించిన మహిళలే.. పాదయాత్ర అగ్రభాగాన ఉండి నడిపించారు.
ఒకే రాష్ట్రం - ఒకే రాజధాని
పడవల రేవు నుంచి మీసాల రాజేశ్వరరావు వంతెన వరకు మార్గం అంతా అమరావతి నినాదాలు, ఉద్యమ గీతాలతో హోరెత్తింది. అమరావతి సాంస్కృతిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో పాడిన పాటలు, ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ హుషారెత్తించాయి. ముఖ్యంగా రాజధాని గ్రామాల నుంచి మహిళలు, రైతులు, రైతు కూలీలు పెద్ద ఎత్తున పాదయాత్రకు తరలివచ్చారు. ‘సీఎం డౌన్ డౌన్’, ‘భూములిచ్చాం.. రోడ్డున పడ్డాం’, ‘జై అమరావతి.. ‘జయహో అమరావతి, ‘భూములు ఇస్తే కేసులు పెడతారా? ఒకే రాష్ట్రం ఒకే రాజధాని’ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా దారిపొడవునా నినాదాలు చేశారు.