amaravathi farmers padayatra: రాజధాని రైతులు చేపట్టిన మహా పాదయాత్ర 34వ రోజుకు చేరుకుంది. మహాపాదయాత్ర నేడు నెల్లూరు జిల్లాలోని గూడూరు నియోజకవర్గంలోని పుట్టంరాజువారి కండ్రిగ వద్ద ముగసింది. రైతుల మహాపాదయాత్రకు తిప్పవరప్పాడు వద్ద.. తెదేపా మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ ఘనస్వాగతం పలికారు. రైతులు గత రాత్రి సైదాపురంలో రోడ్డు పక్కనే ఓ ప్రైవేటు స్థలంలో టెంట్లు వేసుకుని బస చేశారు. చెమిర్తిలో భోజన విరామం అనంతరం కొమ్మనేటూరు, తిరువెంగళాయపల్లి మీదగా పుట్టంరాజువారి కండ్రిగ వరకు రైతుల పాదయాత్ర.. సుమారు 11కిలోమీటర్ల మేర సాగింది.
రైతులకు నెల్లూరు ప్రజల ఘనస్వాగతం..
గూడూరు ప్రజలు.. రాజధాని రైతుల మహాపాదయాత్రకు ఘనస్వాగతం పలికారు. తిప్పవరప్పాడు వద్ద నియోజకవర్గ సరిహద్దులో.. రైతులకు నెల్లూరు ప్రజలు నీరాజనాలు పలికారు. కళాకారుల నృత్యాలు, వీరతాళ్లతో ప్రదర్శనలు నిర్వహిస్తూ అడుగడుగునా ఆప్యాయత చాటారు. హిందూ, ముస్లిం, క్రైస్తవ మతస్థులు పొలిమేర వద్ద ప్రార్థనలు నిర్వహించారు. తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.